*రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి 21 వరకు రాష్ట్రపతి పర్యటన.*


 *రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి 21 వరకు రాష్ట్రపతి పర్యటన.*


హైదరాబాద్, డిసెంబర్ 11: శీతాకాల విడిదిలో భాగంగా గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తెలిపారు. రాష్ట్రపతి ఐదు రోజుల పర్యటనను దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లపై గురువారం డా. బి. ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.


రాష్ట్రపతి పర్యటన సమయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విస్తృత ఏర్పాట్లు చేయాలని సి.ఎస్. ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు మరియు రాష్ట్రపతి నిలయం అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.


పోలీసు శాఖ భద్రతా, ట్రాఫిక్, బందోబస్త్ ప్రణాళికను సిద్ధం చేయాలని, అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు ఫైర్ టెండర్లు మరియు అన్ని రకాల అగ్నిమాపక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ వైద్య బృందం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


రోడ్లు భవనాల శాఖ అవసరమైన బారికేడ్లు, ఇతర ఏర్పాట్లు చేయాలని, జీహెచ్‌ఎంసీ–పోలీసు శాఖల సమన్వయంతో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో 24 గంటలు స్నేక్ క్యాచర్ బృందం అందుబాటులో ఉండాలని ఆదేశించారు.


జీహెచ్‌ఎంసీ సమన్వయంతో రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతుల బెడదను తగ్గించేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని, అలాగే తేనెటీగలను నియంత్రించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.


ఈ సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, హోమ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సి. వి. ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పొలిటికల్ కార్యదర్శి ఈ. శ్రీధర్, అదనపు డీజీపీలు మహేష్ భగవత్, GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్, సమాచార–పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ చి. ప్రియాంక, ప్రొటోకాల్ డైరెక్టర్ శివలింగయ్య తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం