న్యూఢిల్లీ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు సగటు కంటే అధికంగా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. డిసెంబర్-ఫిబ్రవరి మధ్యలో.. ఈ ఏడాది చలికాలం కాస్త వెచ్చగా ఉండే అవకాశముందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న భూతాపం కారణంగానే శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 2016 నుంచి కాలానుగుణ సూచనలు తెలియజేస్తోంది ఐఎండీ. ప్రతి ఏడాదీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేస్తోంది. 2018 సంవత్సరం అంతర్జాతీయంగా కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా నిలిచింది. కోర్ కోల్డ్ వేవ్ ప్రాంతం.. ఈ శీతాకాలంలో కోర్ కోల్డ్ వేవ్ (సీడబ్ల్యూ) ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఓ వాతావరణ అధికారి తెలిపారు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, దిల్లీ, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఝార్ఖండ్, బంగాల్, ఒడిశా, తెలంగాణ, జమ్మూలోని వాతావరణ ఉపవిభాగాలు, జమ్ము, కశ్మీర్, లద్దాఖ్, మరాఠావాడ, విదర్భ, సౌరాష్ట్ర (గుజరాత్), మధ్య మహారాష్ట్రలు కోర్ కోల్డ్ వేవ్ ప్రాంతాల కిందకు వస్తాయి.