సర్కార్ వైద్యానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఐఏఎస్‌లు..





 సర్కార్ వైద్యానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఐఏఎస్‌లు..

 

ప్రభుత్వ హాస్పిటల్స్ కు క్యూ కడుతున్న ఆఫీసర్లు


తాజాగా గాంధీలో ప్రసవించిన ఐఏఎస్ అధికారి గౌతమ్ సతీమణి


తల్లీబిడ్డ క్షేమం.. విజయవంతంగా ఆపరేషన్ చేసిన డాక్టర్ శోభ బృందం


మొన్న శ్రీహర్ష, నిన్న పమేలా సత్పతి.. నేడు గౌతమ్.. మారుతున్న సీన్


అధికారుల రాకతో సామాన్య ప్రజల్లో సర్కార్ వైద్యంపై పెరుగుతున్న ధీమా



రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో నూతన అధ్యాయం మొదలైంది. ఒకప్పుడు ప్రభుత్వ హస్పిటల్ అంటేనే భయపడే పరిస్థితి నుంచి, నేడు రాష్ట్రంలోని అత్యున్నత స్థాయి అధికారులే క్యూ కట్టే స్థాయికి సర్కార్ వైద్యం ఎదిగింది. ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ వైద్యానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లే స్థోమత ఉన్నప్పటికీ, ప్రభుత్వ డాక్టర్ల నైపుణ్యంపై భరోసాతో ఐఏఎస్‌లు తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే చికిత్స చేయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.


గాంధీలో ఐఏఎస్ గౌతమ్ సతీమణి... 

ఐఏఎస్ అధికారి గౌతమ్ సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ను ఎంచుకున్నారు. తన భార్య ప్రసవం నిమిత్తం ఆమెను గాంధీ హాస్పిటల్ లో చేర్పించారు. సోమవారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో, గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ శోభ నేతృత్వంలోని వైద్య బృందం వెంటనే స్పందించింది. అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి సిజేరియన్ ద్వారా ప్రసవం చేశారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, డాక్టర్ల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.


వరుస కడుతున్న కలెక్టర్లు.. కార్పొరేట్‌కు టాటా

కేవలం గౌతమ్ మాత్రమే కాదు, ఇటీవల కాలంలో పలువురు జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్య సేవలు పొందడం గమనార్హం.


కోయ శ్రీహర్ష: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తన సతీమణి ప్రసవం కోసం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఎంచుకున్నారు. అక్కడ ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.


జితేష్ వి పాటిల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సతీమణి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పు చేయించుకున్నారు.


పమేలా సత్పతి: కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అనారోగ్యంతో బాధపడుతూ, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఈఎన్‌టీ విభాగంలో చేరి విజయవంతంగా నాజల్ సర్జరీ (ముక్కు శస్త్రచికిత్స) చేయించుకున్నారు. స్వయంగా కలెక్టరే ఆపరేషన్ చేయించుకోవడం ద్వారా వ్యవస్థపై నమ్మకాన్ని చాటారు.


పెరుగుతున్న భరోసా.. పేదోడికి ధీమా

ఐఏఎస్ అధికారులే కాకుండా, న్యాయమూర్తులు సైతం నిమ్స్, గాంధీ వంటి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండటం విశేషం. సమాజంలో ఉన్నత హోదాలో ఉన్నవారు ప్రభుత్వ వైద్యాన్ని నమ్మి వస్తుండడంతో, పేద, మధ్యతరగతి ప్రజల్లో సర్కార్ దవాఖానాలపై విశ్వాసం రెట్టింపవుతోంది. "అధికారులే చికిత్స చేయించుకుంటున్నారంటే, అక్కడ వైద్యం ఎంత నాణ్యంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు," అని సామాన్యులు చర్చించుకుంటున్నారు. మాటల్లో చెప్పడమే కాదు.. చేతల్లోనూ చూపిస్తూ ఐఏఎస్ అధికారులు తెలంగాణ వైద్య రంగానికి నిజమైన బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తున్నారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం