మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు. - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు.
ఎన్నికలలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు- జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరిక.
గ్రామపంచాయతీ చివరి విడత ఎన్నికలను ఆషామాషీ గా తీసుకోవద్దని, ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు.
మంగళవారం ఆమె మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న దేవరకొండ డివిజన్ పరిధిలోని గ్రామపంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు,రెవెన్యూ ఆదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ దేవరకొండ ఆర్డిఓ, డిపిఓ,జెడ్ పి సీఈఓ లతో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించే విషయమై టేలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
కొంత మంది ఆర్ ఓ ల నిర్లక్ష్యం కారణంగా మొదటి, రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో అక్కడక్కడ ఇబ్బందులు తలెత్తాయని ఈ విడత అలాంటి సమస్యలు రాకుండా ఎన్నికలు నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాల ఏర్పాటు, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనలో ఆర్ ఓ లు ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. పోలింగ్, కౌంటింగ్ నిర్వహణలో లోపాలు కనిపిస్తే సంబంధిత ఆర్ ఓ, ఎంపీడీవోలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీడీవోలు మరోసారి వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ కేంద్రం
లే అవుట్ ను పరిశీలించుకోవాలన్నారు. ఓటింగ్ జరిగే సమయంలో పోలింగ్ బూతులో ముగ్గురికి మించి ఉండరాదని, మహిళలు, పురుషులకు వేరువేరుగా క్యూ లైన్లు ఉండాలని ,ఓటింగ్ కంపార్ట్మెంట్ కిటికీలకు దగ్గరగా ఏర్పాటు చేయవద్దని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ ముగిసిన పిదప మధ్యాహ్నం 2 గంటలకు తప్పనిసరిగా ఓట్ల లెక్కింపును ప్రారంభించాలని చెప్పారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో 85% వెబ్ క్యాసింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, తక్కిన వాటిలో వీడియోగ్రఫీ చేయించాలని ఆదేశించారు.
కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ సమస్య రాకుండా చూసుకోవాలన్నారు. ఎక్కడైనా రీ కౌంటింగ్ అవసరమైతే జాగ్రత్తగా నిర్వహించాలని, రిటర్నింగ్ అధికారులు స్టాచుటరీ, నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ ను భద్రంగా తమ దగ్గరే ఉంచుకోవాలని ,ఎట్టి పరిస్థితుల్లో మెటీరియల్ బయటికి రాకూడదన్నారు. రీకౌంటింగ్ నిర్వహించే బాధ్యత పూర్తిగా ఆర్ ఓ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుందని అన్నారు. కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత ఫలితాల ప్రకటనలో అనవసరంగా జాప్యం చేయవద్దని చెప్పారు. స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్ పూర్తిగా వారి కస్టడీలో ఉంచుకోవడం ఆరో బాధ్యత అని తెలిపారు. మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ సవ్యంగా నిర్వహించేందుకు జిల్లాలోని ఇతర ఆర్డీవోలతోపాటు, స్పెషల్ అధికారులు ,జిల్లా అధికారులను సైతం ఆయా మండలాలకు నియమించినట్లు కలెక్టర్ వెల్లడించారు.

Comments
Post a Comment