ఊరికి ఉపకారి....రాజయ్య సహకారి..!
ఊరికి ఉపకారి....రాజయ్య సహకారి..!
అప్పుడెప్పుడో సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు ఇప్పటికీ సేవ
మాందాపురం మాజీ సర్పంచ్ సేవా నిరతి
సంగారెడ్డి : అప్పుడెప్పుడో ఆయన్ని గ్రామస్తులు సర్పంచ్ గా ఎన్నుకున్నారు..! కానీ నేటికీ ఆయన తనకు తోచిన మేరకు గ్రామానికి సేవ చేస్తున్నారు! గ్రామస్తులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు! తన వద్దకు వచ్చిన వారికి చేతనయినంత సాయం చేస్తున్నారు. అల్లాదుర్గం మండలం మాందాపురం మాజీ సర్పంచ్ కుందారం రాజయ్య సేవా నిరతి ఇది...!!
సంపాదన కోసమే చాలామంది రాజకీయాల్లోకి వస్తున్న ఈ తరుణంలో రాజయ్య లాంటి వాళ్లు అరుదుగా కనిపిస్తుంటారు.
యువత రాజకీయాల్లోకి రావాలని నాడు ఎన్టీఆర్ పిలుపునివ్వడంతో రాజయ్య టిడిపిలో చేరారు. క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తుండగా, నాటి ముఖ్య నేత కరణం రామచంద్ర రావు ఆయన్ని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఆ తర్వాత 1988లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజామోదం పొందారు. గ్రామానికే చెందిన సీనియర్ నేతను ఓడించి చరిత్ర సృష్టించారు. సర్పంచిగా మంచి మెజార్టీతో గెలుపొందారు.
ఆ సమయంలోనే కరణం రామచంద్రరావు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. కరణం సహకారంతో , ఆ తర్వాత మంత్రిగా ఉన్న మల్యాల రాజయ్య సహకారంతో
గ్రామంలో సిసి రోడ్లు వేయించారు. సైడ్ డ్రైనేజీలను నిర్మించారు గ్రామపంచాయతీ భవనాన్ని కట్టించారు. అంతేకాకుండా అల్లాదుర్గం వరకు రోడ్డును మంజూరు చేయించారు. అల్లాదుర్గం నుంచి సిల్వర్ వరకు బీటీ రోడ్డు వేయించారు. 65 నిరుపేద కుటుంబాలకు పక్కా ఇండ్లను మంజూరు చేయించారు. సొంత డబ్బుతో గ్రామంలో దుర్గామాత ఆలయాన్ని నిర్మించారు. హనుమాన్ మందిర్ నిర్మాణానికి తన వంతు చేయూతనిచ్చారు. ఎంతో ముఖ్యమైన వైకుంఠ ధామం కోసం సొంత భూమిని అప్పగించారు. సర్పంచ్ పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఊరి కోసం తన వంతు సేవ చేశారు.
రాజయ్య సేవల వల్లనే గ్రామానికి ఎంపీపీ పదవి దక్కింది. ఆయన అనుచరులనే ఒకసారి ఎంపీపీగా, పలు మార్లు సర్పంచ్ గా గ్రామస్తులు ఎన్నుకున్నారంటే.. ఆయన పట్ల అక్కడి ప్రజలకు ఎంత నమ్మకం ఉన్నదో అర్థమవుతుంది.
ఆ తర్వాత రిజర్వేషన్ లు అనుకూలంగా రాకపోవడం.. పరిస్థితులు మారిపోవడం.. ఇంటి బాధ్యతలు పెరగడంతో రాజయ్య క్రియాశీల రాజకీయాలకు కొంత దూరమయ్యారు. ప్రస్తుతం సంగారెడ్డిలో నివాసం ఉంటున్నారు. సరస్వతీ శిశు మందిర్ ద్వారా సేవ చేస్తున్నారు.
అయినప్పటికీ ఈనాటికీ గ్రామస్తులు ఆయన వద్దకు వస్తుంటారు.వారికి చేతనైన సాయం చేస్తుంటారు. సుమారుగా 70 సంవత్సరాల వయసు లో సొంత ఊరి పట్ల ఇంకా మమకారం చూపుతున్నారు. ఊరి పేరు చెబితేనే ఆయన పులకించిపోతారు. తరచూ వెళ్లి వస్తుంటారు... ఊరిలోకి వెళ్ళగానే గ్రామస్తులు ఆయన్ని పలకరించే విధానం చూస్తేనే.. ఎంతటి అభిమానాన్ని మూటగట్టుకున్నారో.. అర్థమవుతుంది. అప్పుడెప్పుడో తనను నమ్మి ఓటేసిన ఊరి కోసం ఈనాటికీ ఎంతోకొంత సేవ చేయడం రాజయ్యకే సొంతం అయ్యింది. అందుకని ఆయన తన పేరును సార్ధకం చేసుకున్నారని చెప్పవచ్చు.

Comments
Post a Comment