రవిశేఖర్‌ కేసులో మరో ట్విస్ట్‌! హయత్‌నగర్‌ ఘటనకు ముందు ఇద్దరు మహిళలను మోసగించిన వైనం


రవిశేఖర్‌ కేసులో మరో ట్విస్ట్‌!
హయత్‌నగర్‌ ఘటనకు ముందు ఇద్దరు మహిళలను మోసగించిన వైనం
టీవీల్లో చూసి ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి


సీతానగరం (తూ.గో): హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. కారులో అపహరించుకుని వెళ్లిన ఘటనలో నిందితుడిగా ఉన్న రవిశేఖర్‌ కేసులో మరో మోసం బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఇద్దరు మహిళలను మభ్యపెట్టిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. హయత్‌నగర్‌ యువతి కిడ్నాప్‌కు ముందే ఈ ఘటన జరగ్గా.. రెండు మూడ్రోజుల నుంచి టీవీలో వస్తున్న కథనాలను చూసి బాధితులు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేయడంతో విషయం బయటకొచ్చింది. ఈ వ్యవహారంలో సీతానగరం ఎస్సై ఆనందకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.


ఈ నెల 20న (శనివారం) స్థానిక బస్టాండు సెంటర్‌లో ఓ మహిళ.. ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తోంది. ఈలోపు నిందితుడు రవిశేఖర్‌ కారులో ఒంటరిగా ఉన్న మహిళ వద్దకు వచ్చి ఏ ఊరు అంటూ ఆమెను పరిచయం చేసుకున్నాడు. తాను అటుగా వెళ్తున్నా అంటూ ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. విజయవాడ కలెక్టరేట్‌లో తాను ఉద్యోగినని నమ్మబలికాడు. గ్రామీణ ప్రాంతాలంటే ఇష్టమని.. అందుకే ఇలా వచ్చానని చెప్పాడు. ఆ రోజు రాత్రి ఆమె ఇంటివద్దనే బస చేశాడు.


మరుసటి రోజు (21వ తేదీ) ఆదివారం ఉదయం ఆమె ఇంటి పక్కనే ఉన్న మరో మహిళను పరిచయం చేసుకున్నాడు. వారు తమకున్న భూ సమస్యను రవిశేఖర్‌కు వివరించారు. ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి రూ.65 వేల నగదు తీసుకుని ఇద్దరు మహిళలతో కారులో సీతానగరం తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నాడు. ఆ రోజు ఆదివారం కావడంతో ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం పని పూర్తి చేయిస్తానని వారిని తీసుకెళ్లిపోయాడు. ఆదివారం రాత్రంతా ఇద్దరు మహిళలతో కొవ్వూరు ప్రాంతంలో కారులోనే సంచరించాడు. 22వ తేదీ (సోమవారం) వేకువజామున మహిళలిద్దరినీ స్థానిక శ్మశానవాటిక వద్ద కారులో నుంచి తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం స్థానికుల సాయంతో స్వగ్రామానికి మహిళలిద్దరూ చేరుకున్నారు. మోసగించిన వ్యక్తి ఎవరో పూర్తిగా తెలియకపోవడంతో ఎవరి మీద ఫిర్యాదు చేయాలో తెలియక మిన్నకుండిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ యువతి కిడ్నాప్‌కు సంబంధించి పదేపదే నిందితుడిని టీవీల్లో చూపించడం గమనించిన ఆ ఇద్దరు మహిళలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆనందకుమార్ తెలిపారు.


రవిశేఖర్‌పై హయత్‌నగర్‌ పోలీసుల రివార్డు


యువతి కిడ్నాప్‌ వ్యవహారంలో నిందితుడు రవిశేఖర్‌ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడిపై హయత్‌నగర్‌ పోలీసులు రివార్డ్‌ ప్రకటించారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష నగదు బహుమతి ఇస్తామని తెలిపారు. రవిశేఖర్‌ AP39AQ 1686 నంబర్‌ గల కారులో తిరుగుతున్నాడని వెల్లడించారు. నిందితుడు నకిలీ నంబర్‌ ప్లేటు ఉన్న కారులోనే తిరుగుతున్నట్లు గుర్తించామన్నారు. రవిశేఖర్‌ ఆచూకీ తెలిస్తే 94906 17161, 94947 21100, 94906 17111 నంబర్లకు ఫోన్‌ చేయాలని హయత్‌నగర్‌ పోలీసులు సూచించారు.


Comments