జర్నలిస్టు వద్ద లంచం తీసుకొని ఏసీబీ కి చిక్కిన పంచాయతీ అధికారులు
గూఢచారి, షాద్నగర్:
ఈదులపల్లి వద్ద నిర్మాణం పనులకు లంచం 2.50 లక్షల లక్ష్యం, లక్షన్నర చెల్లించినా అందని అనుమతులు, ఏసీబీని ఆశ్రయించిన జర్నలిస్ట్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్న జిల్లా ఏసీబీ శాఖ డిఎస్పి ఆనంద్.
*షాద్ నగర్ లో సంచలనం*
సింహం పడుకుంది కదా అని దాని తలను దువ్వెనతో దువ్వాలని చూడకూడదు.. తొక్కుతున్నది తోకే కదా అని పాము జోలికి వెళ్ళకూడదు.. అలాంటిది షాద్ నగర్ లో ఒక దిన పత్రికకు పాత్రికేయుడుగా పనిచేస్తున్న వ్యక్తిని నిర్భయంగా లంచం అడిగి, కాగితాలు ఇవ్వకుండా వేధించి చివరికి ఏసీబీ అధికారులకు బుక్ అయ్యారు.. షాద్ నగర్ నియోజకవర్గంలో నందిగామలో సంచలనం ఇది. జర్నలిస్ట్ దెబ్బకు రంగంలోకి దిగిన ఎసిపి శాఖ డిఎస్పి ఆనంద్ లంచం ఆశించిన నందిగామ ఎంపీడీవో సుమతి, ఎంపీఓ ధీర్ సింగ్, వీఆర్వో చెన్నయ్యలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారి లంచావతారాలకు తెరదించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
*జరిగిన కథ..*
షాద్ నగర్ పరిధిలో ఓ ప్రముఖ దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్న జర్నలిస్టు నందిగామ మండలం ఈదులపల్లి పరిధిలో రిసార్ట్స్ నడిపిస్తున్నాడు. అందులో కొన్ని గెస్ట్ హౌస్ ల నిర్మాణాల నిమిత్తం అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఎంపీడీవో సుమతి, ఎంపీఓ తేజ్ సింగ్, వీఆర్వో చెన్నయ్యలు ఈ అనుమతుల కోసం ఐదు లక్షలు లంచం ఇవ్వాలని పట్టుబట్టారు. తాను అంత ఇచ్చుకోలేనని బతిమాలగా 2.50 లక్షలకు బేరం కుదిరింది. ఇందులో లక్షన్నర బాధితుడు చెల్లించాడు. కానీ మిగతా లక్ష రూపాయలు ఇచ్చేదాకా అనుమతి పత్రాలు ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పారు. ఇంత బహిరంగంగా జరుగుతున్న అవినీతిని చూసి సహించలేకపోయిన జర్నలిస్టు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది..
*రంగంలోకి అధికారులు..*
ఏసీబీ అధికారుల వ్యూహం ప్రకారం బుధవారం మిగతా డబ్బులు ఇచ్చేందుకు జర్నలిస్టు సమ్మతం తెలిపి వారు చెప్పిన ప్రకారమే అధికారులను కలిసి డబ్బులు చెల్లించాడు. అప్పటికే పంచుకున్న ప్రభుత్వ అధికారి సిబ్బందినీ ఏసీబీ అధికారులు డిఎస్పి ఆనంద్ తో సహా ఇతర పోలీసులు రంగంలోకి దిగి ఎంపీడీవో సుమతి, ఎంపీఓ తేజ్ సింగ్, వీఆర్వో చెన్నయ్య లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుంచి లంచం రూపంలో తీసుకున్న లక్ష రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై డిఎస్పి ఆనంద్ మాట్లాడుతూ ఫిర్యాదు మేరకు ముగ్గురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసి గురువారం కోర్టులో హాజరు పరచనున్నట్లు వెల్లడించారు. అనుమతుల కోసం లంచం అడిగిన వివరాలు వాస్తవమేనని ధ్రువీకరించారు.
*మరి ఇంత బరితెగింపా..*
ఎక్కడైనా అవినీతి జరిగినా, ఎవరైనా లంచాలు అడిగినా దానిని వెలుగులోకి తెచ్చి ఆ అన్యాయానికి అక్షర రూపం ఇచ్చి బాధితులకు న్యాయం చేసేది జర్నలిస్టులు. అలాంటి జర్నలిస్టులని బహిరంగంగా లంచం అడిగారంటే అధికారులు ఏ స్థాయికి తెగించి తమ విధులు నిర్వహిస్తున్నారో ఇక్కడ స్పష్టమవుతుంది. ఎవరైతే నాకేంటి.. లంచం ఇవ్వాల్సిందే.. అన్నట్లుగా నిస్సిగ్గుగా వ్యవహరించడం వల్లనే అధికారులు వరుసగా ఏసీబీకి బుక్ అవుతున్నారు. ఇంతకుముందు కూడా నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఒక జర్నలిస్టును గెలికితే ఎలా ఉంటుందో.. అధికారులకు ఇప్పుడు అర్థం అయి ఉంటుంది. నిజాయితీగా వ్యాపార దృక్పథంతో సొంత డబ్బులతో భవనం నిర్మించుకుంటే దాని అనుమతులు కూడా లంచం అడిగారంటే ఈ అధికారులను ఏమనాలి.

Comments
Post a Comment