హిమాయత్‌సాగర్ పరిసరాల్లో అక్రమ మైనింగ్ – ‘మరో KGF’లా ప్రకృతి వనరుల దోపిడీ: ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్



హిమాయత్‌సాగర్ పరిసరాల్లో అక్రమ మైనింగ్ – ‘మరో KGF’లా ప్రకృతి వనరుల దోపిడీ: ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్


హిమాయత్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్, క్రషర్ యూనిట్ల కార్యకలాపాలపై బీఆర్‌ఎస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పరిశీలన నిర్వహించినట్లు ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తెలిపారు. హిమాయత్‌సాగర్ ప్రాంతంలోని సర్వే నంబర్లు 66, 67, 68, 69లో నడుస్తున్న క్రషర్ యూనిట్లను బృందం ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.


ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ బృందంలో ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్‌తో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, రాజేంద్రనగర్ పార్టీ ఇన్‌చార్జ్ పట్లొళ్ల కార్తీక్ రెడ్డి, ఎస్సీ–ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేషన్ మాజీ ఛైర్మన్లు డా. క్రిశాంక్, డా. వాసుదేవ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఉపేంద్రాచారి, కే. కిషోర్ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకుడు అభిలాష్ రంగినేని పాల్గొన్నారు.


ఈ సందర్భంగా డా. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, అక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే KGF సినిమా గుర్తుకు వచ్చిందన్నారు. భూమాతను చెరబట్టి ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. కొండలను బద్దలు కొట్టి గుట్టల కొద్దీ సంపదను దోచుకుంటున్నారని, ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలు మరో KGF‌ను తలపించేలా సాగుతున్నాయని వ్యాఖ్యానించారు.


ఈ ప్రాంతం ట్రిపుల్ వన్ (GO 111) పరిధిలోకి వస్తుందని, ఇక్కడ ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు జరగకూడదని స్పష్టం చేశారు. అయితే అన్ని నియమ నిబంధనలకు తూట్లు పొడిచి అక్రమంగా క్రషర్ యూనిట్లు నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని తెలిపారు.


క్రషర్ యూనిట్ల నిర్వహణకు అనేక అనుమతులు అవసరమని ఆయన పేర్కొన్నారు. మైనింగ్ లీజు, క్వారీ పర్మిట్, గ్రామ పంచాయతీ నుంచి ఎన్‌వోసీ, పర్యావరణ శాఖ అనుమతులు, భూగర్భ జలవనరుల శాఖ అనుమతులు వంటి కీలక అనుమతులు తప్పనిసరి అని తెలిపారు. సాధారణంగా కనీసం తొమ్మిది రకాల అనుమతులు పొందిన తర్వాత మాత్రమే క్రషర్ యూనిట్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రాంతంలో నడుస్తున్న యూనిట్లకు ఈ అనుమతుల్లో చాలా వరకు లేవని తెలిపారు.


ఎప్పుడో మూతపడిన క్రషర్ యూనిట్‌ను మళ్లీ ప్రారంభించారని, దానికి లీజు ట్రాన్స్‌ఫర్ ఎవరు చేశారు? ఎవరు అనుమతి ఇచ్చారు? అనే విషయాలను ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.


అలాగే ఓఆర్‌ఆర్‌కు కిలోమీటర్ పరిధిలో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు ఉండకూడదని నిబంధనలు ఉన్నాయని, అయితే ఇక్కడ ఓఆర్‌ఆర్‌కు కిలోమీటర్ కన్నా తక్కువ దూరంలోనే క్రషర్ యూనిట్లు ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు.


ఈ సందర్భంగా రాజేంద్రనగర్ పరిధిలోని మానస హిల్స్ ప్రాంతంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్ మరియు రెడీ మిక్స్ కాంక్రీట్ (RMC) ప్లాంట్ కార్యకలాపాలపై కూడా ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఈ సంస్థ, కేబినెట్ మంత్రి హోదాను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.


పేదలకు కేటాయించిన అసైన్డ్ భూముల్లోనే ఈ యూనిట్ నడుస్తోందని తెలిపారు. అసైన్డ్ భూముల చట్టం ప్రకారం ఈ భూములను ఎవరికీ బదిలీ చేయకూడదని, లీజుకు ఇవ్వకూడదని, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించకూడదని ఆయన గుర్తు చేశారు. అయితే ఆ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ కొండలను పిండిచేస్తూ విలువైన ఖనిజ సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు.


తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB) మరియు మైనింగ్ శాఖ నిబంధనల ప్రకారం స్టోన్ క్రషర్ యూనిట్ నిర్వహించాలంటే అనేక అనుమతులు తప్పనిసరి అని తెలిపారు. వాటిలో CTE (Consent to Establish), CTO (Consent to Operate), మైనింగ్ లీజు లేదా క్వారీ పర్మిట్, గ్రామ పంచాయతీ NOC, పర్యావరణ క్లియరెన్స్, భూగర్భ జలాల వినియోగ అనుమతి, పరిశ్రమల శాఖ రిజిస్ట్రేషన్, సైట్ ప్లాన్ మరియు సాంకేతిక నివేదిక, పరిశ్రమల విద్యుత్ కనెక్షన్ వంటి అనుమతులు ఉండాలని పేర్కొన్నారు.


అయితే రాఘవ కన్స్ట్రక్షన్స్ ఈ అనుమతుల్లో ఏ ఒక్కదానికీ సంబంధించి సరైన ఆధారాలు లేవని ఆరోపించారు. దీనివల్ల అక్కడ నడుస్తున్న స్టోన్ క్రషర్ యూనిట్ మరియు RMC ప్లాంట్ పూర్తిగా అక్రమమని తెలిపారు. ఇది పర్యావరణ పరిరక్షణ చట్టాలు, మైనింగ్ నిబంధనలు మరియు తెలంగాణ అసైన్డ్ భూముల చట్టం యొక్క తీవ్రమైన ఉల్లంఘన అని పేర్కొన్నారు.


ప్రాథమిక అంచనాల ప్రకారం అక్కడ సుమారు 8 లక్షల టన్నుల రాయిని తవ్వి తీసినట్లు తెలుస్తోందని తెలిపారు. టన్నుకు రూ.167 సీనరేజ్ ఫీజు ప్రకారం ప్రభుత్వానికి కనీసం రూ.14.36 కోట్ల ఆదాయం ఎగవేయబడిందని, ఇతర చార్జీలతో కలిపి మొత్తం సుమారు రూ.15.23 కోట్ల నష్టం ప్రభుత్వానికి వాటిల్లిందని పేర్కొన్నారు.


మైనింగ్ నిబంధనల ప్రకారం అక్రమ తవ్వకాలకు రాయల్టీకి పది రెట్లు వరకు జరిమానా విధించే అవకాశం ఉందని, ఆ ప్రకారం ఈ కేసులో రూ.150 కోట్లకు పైగా జరిమానా విధించాల్సి ఉంటుందని తెలిపారు.


రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ప్రకృతి వనరుల దోపిడీకి కేంద్రంగా మారిందని, అటు రేవంత్ రెడ్డి, ఇటు పొంగులేటి కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. మంత్రి అయినా, మరెవరైనా సరే అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.





Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ