ఎంత ఎదిగినా మూలాలను మర్చిపోవద్దు: వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ యెలిశాల రవి ప్రసాద్
ఎంత ఎదిగినా మూలాలను మర్చిపోవద్దు: వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ యెలిశాల రవి ప్రసాద్
నల్గొండ: జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తమ మూలాలను, సమాజాన్ని మర్చిపోవద్దని వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ యెలిశాల రవి ప్రసాద్ విద్యార్థులకు పిలుపునిచ్చారు.
వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తూ మంచి నడవడిక, సంస్కారం అలవర్చుకుని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని సూచించారు.
ఈ ఏడాది వైఆర్పీ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 100 మందికి పైగా విద్యార్థులకు రూ.80 లక్షల స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నామని తెలిపారు. ఇందులో నల్గొండ జిల్లాకు చెందిన 41 మంది విద్యార్థులకు రూ.12 లక్షలు పంపిణీ చేసినట్లు చెప్పారు.
స్కాలర్‌షిప్‌లను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, అనంతరం తమలాంటి అవసరమైన విద్యార్థులకు సహాయం చేస్తూ సమాజానికి తిరిగి సేవ చేయాలని సూచించారు. చదువుతో పాటు సంస్కారం, మంచి వ్యక్తిత్వం కూడా పెంపొందించుకోవాలని, కుల, మత, వర్గ భేదాలు లేకుండా ఐక్యంగా ఉంటూ అభివృద్ధి సాధించాలని అన్నారు.
వైఆర్పీ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఏడాది పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను కూడా పంపిణీ చేస్తున్నామని, ఈ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని తెలిపారు.
ఈ సందర్భంగా నల్గొండ కార్పొరేటర్ యామా కవిత మాట్లాడుతూ, విద్యాదానం అన్నింటికంటే గొప్పదని, అది సమాజంలో సానుకూల మార్పులకు దోహదపడుతుందని అన్నారు. స్కాలర్‌షిప్‌లు పొందిన విద్యార్థులు విద్యలో ప్రతిభ కనబర్చి ఉన్నత ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వైఆర్పీ ఫౌండేషన్ డైరెక్టర్ శరత్ చంద్ర, వైఆర్పీ జిల్లా ఇన్‌చార్జ్ యామా దయాకర్, రాఘవాచారి తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment