వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా చూడండి - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా చూడండి - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ:
వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రైతులు ఇబ్బందులు పడకుండా ఎరువుల సక్రమ సరఫరా,సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల ద్వారా సక్రమ నీటి నిర్వహణ, రేషన్ కార్డుల పంపిణీ, తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.
సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి మంత్రులు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులకు ఆయా అంశాలపై దిశానిర్దేశం చేస్తూ... రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధుల నివారణ
భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడడం, నీటిపారుదల ప్రాజెక్టులు చెరువుల ద్వారా సరైన విధంగా నీటిని వినియోగించుకోవడం, రేషన్ కార్డుల పంపిణీ పై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని దాని ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు.
అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆయా అంశాలపై మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థలను అప్రమత్తం చేయాలని, భారీ వర్షాల వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున ఎస్ డి ఆర్ ఎఫ్, ఎన్ డి ఆర్ ఎఫ్, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగాకుండా చూసుకోవాలని, ఒక్క హైదరాబాద్ లోనే 150 ఎస్ డి ఆర్ ఎఫ్ టీములు ఉన్నాయని, పోలీస్, జిహెచ్ఎంసి సహకారంతో హైద్రాబాద్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ శాఖ ద్వారా ముందస్తు హెచ్చరికలను తెలుసుకొని ఐసీసీ ద్వారా వర్షాలు వచ్చే ప్రాంతాలకు ముందే విపత్తు నిర్వహణ బృందాలను పంపించి నష్టాలను నివారించాలన్నారు. ఈ విషయంలో పోలీసులతో సమన్వయం చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాల సమయంలో పిడుగుపాటుకు మనుషులు, పశువులు చనిపోయే అవకాశం ఉందని, జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడైనా మనుషులు, పశువులు చనిపోతే వెంటనే సహయం అందించేలా ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు.
వర్షాల వల్ల అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నివారణకు నీటి నిల్వ లేకుండా చూడాలని, దోమలు పెరగకుండా ఆయిల్ బాల్స్, ఫాగింగ్ ,పిచికారి చేయించాలని, ప్రభుత్వ డాక్టర్లందరూ అందుబాటులో ఉండాలని, మందులు అందుబాటులో ఉంచుకోవాలని, జిల్లా కలెక్టర్లు తప్పనిసరిగా ప్రాథమిక వైద్య ఆరోగ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేయాలని, అవసరమైతే అత్యవసర సమయాల్లో మందులు, ఇతర వైద్య సౌకర్యాల కు జిల్లా కలెక్టర్ల అకౌంట్లలో కోటి రూపాయల నిధులను ఉంచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదలపై సమీక్షిస్తూ అవసరమైన చోట సాగునీటిని ఇచ్చే విధంగా నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని విడుదల చేయాలని, వ్యవసాయం, నీటిపారుదల శాఖలు సమన్వయంతో నీటి నిర్వహణ చేపట్టాలని , కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే 75% చెరువులు నిండాయని, ప్రాజెక్టులు, చెరువులపై జిల్లా కలెక్టర్లు ప్రతిరోజు సమీక్షించాలని, అవసరానికి తగ్గట్టుగా నీటిని విడుదల చేయాలని సూచించారు.
రైతులు ఎరువులకు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకించి యూరియా విషయంలో ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా, సోషల్ మీడియాలో తప్పుదు పోస్టులు పెట్టిన కఠిన చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్లు ఎరువుల నిలువలపై ప్రతిరోజూ ఆయా షాపుల ముందు బోర్డులు ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఎరువులకు ఇబ్బందులు తలేత్తకుండా చూడాలని, ఎరువుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో ఉంచాలని ,ఎరువులను ప్రత్యేకించి యూరియాను ఇతర కార్యక్రమాలకు దారి మళ్లిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, యూరియా పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా చూడాలని, వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు యూరియాను దారి మళ్లిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఎరువుల పై జిల్లా స్థాయిలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి పబ్లిక్ ప్లేస్ ల లో వీటిని ఏర్పాటు చేయాలన్నారు.
రేషన్ కార్డుల పై రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సన్న బియ్యం ఇచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని, 7 లక్షల పైన కొత్త కార్డులు ఇస్తున్నామని, 31,000 మంది రేషన్ కార్డులలో కొత్తగా నమోదయ్యారని, ఇదివరకే 96 లక్షల 95000 కార్డులు ఉన్నాయని ,సన్న బియ్యం వచ్చిన తర్వాత రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ పెరిగిందని, సన్న బియ్యం నూతన రేషన్ కార్డుల పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఈనెల 25 నుండి ఆగస్టు 10 వరకు అన్ని మండలాలలో అధికారికంగా రేషన్ కార్డులు పంపిణీ చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, జిల్లాల ఇన్చార్జి మంత్రులు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకచోట రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొనాలని, జిల్లా కలెక్టర్లు అన్ని మండలాలలో సంబంధిత శాసనసభ్యులతో కలిసి రేషన్ కార్డుల పంపిణీకి హాజరుకావాలని, ఇందుకుగాను ఉమ్మడి జిల్లా కేంద్రంలో ముందుగా సమావేశం నిర్వహించి ఒక ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా నుండి మాట్లాడుతూ వర్షాలు కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదని, యూరియాకు ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదని భావిస్తున్నామని ,జిల్లా కలెక్టర్లు వర్షాలతో పాటు, రేషన్ కార్డులు, సీజనల్ వ్యాధులు,సాగునీటి విడుదల వంటి అన్ని అంశాలపై సరైన నిర్వహణ చేస్తే ఎలాంటి సమస్య ఉండదని తెలిపారు.
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నీటిపారుదల, రేషన్ కార్డుల పై మాట్లాడగా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ రాజనర్సింహ వైద్య, ఆరోగ్య విషయాలపై మాట్లాడారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ అంశాలపై మాట్లాడారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సింహాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులను అరికట్టడంలో భాగంగా మారుమూల గిరిజన ప్రాంతాలకు మలేరియా కిట్లను ఎక్కువ పంపించాలని, అలాగే గిరిజన ప్రాంతాలలో సరైన ప్రసవ సమయాలను ముందే తెలుసుకొని ప్రసవానికి గిరిజన మహిళలను సమయానికి హాస్పిటల్ కి తీసుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు .
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ప్రాణ, నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూడాలని, రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసినట్లు గానే జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమైన అంశాలపై ప్రతిరోజు జిల్లా కలెక్టర్లు
సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు.
Comments
Post a Comment