పెద్ద మనసున్న చిన్న ఎల్లారెడ్డి! రజాకార్లను తరిమికొట్టాడు ఊరందరికీ తోడున్నాడు
పెద్ద మనసున్న చిన్న ఎల్లారెడ్డి!
రజాకార్లను తరిమికొట్టాడు
ఊరందరికీ తోడున్నాడు
..
మహబూబ్ నగర్:
ఆయన పేరుకే చిన్న ఎల్లారెడ్డి! కానీ పెద్ద మనసు కలవాడు!! సాధారణ కుటుంబంలో జన్మించి అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. రజాకార్లను తరిమికొట్టాడు. పేదలకు అండగా నిలిచాడు.వందలాది మందికి ఉపాధి కల్పించాడు. తన సంతానం కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాడు. దేవరకద్ర నియోజకవర్గం లోని ధమాగ్నాపూర్ గ్రామంలో తోకల చిన ఎల్లారెడ్డి 1926 అక్టోబర్ 10వ తేదీన జన్మించాడు. నాటి పరిస్థితులు ఘోరంగా ఉండేవి. గ్రామాలపై రజాకార్లు పాశవిక దాడుల నిర్వహించేవారు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో గ్రామస్తులను కూడగట్టాడు. రజాకార్లను తరిమికొట్టాడు. ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో తన వంతుగా బీడీ పరిశ్రమ ద్వారా వందలాది మందికి ఉపాధి కల్పించాడు. నాటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్నప్పుడు, తన పరిచయస్తుల ద్వారా వందలాది మందికి ముంబైలో ఉపాధి కల్పించాడు. మూడు దఫాలు దమగ్నాపూర్ కు ఎదురులేని నేతగా, ప్రజల మనసు గెలుచుకున్న సర్పంచిగా ఎన్నికయ్యాడు.ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ జీవితంలో కష్టపడితేనే, ఎదుగుతామని ముక్కు సూటిగా చెప్పేవాడు. తాను చెప్పినదే స్వయంగా పాటించాడు.పాలమూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. సాగునీరు సరిగ్గా లేని ఆ రోజుల్లో విత్తనాలను స్వయంగా తయారు చేయడం అనేక మందికి నేర్పించాడు. తద్వారా పాడిపంటలను పెంపొందించాడు. ధాన్యపు రాశులను కురిపించాడు. కులమత బేధం లేకుండా పరిసర గ్రామస్తులు అందరికీ తోకల చిన్న ఎల్లారెడ్డి పెద్దదిక్కుగా నిలిచాడు. గ్రామాలలో కనీస సౌకర్యాలు కల్పిస్తే గ్రామస్తులు తమ చెయ్యి దాటిపోతారేమోనని కొందరు నేతలు భావించేవారు.. కానీ వారికి భిన్నంగా గ్రామానికి రోడ్లు మంచినీటి సౌకర్యాన్ని, ఇతర వసతులను చిన్న ఎల్లారెడ్డి కల్పించారు. గ్రామస్తులకు తలలో నాలుక లాగా పెద్దదిక్కులాగా నిలిచాడు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. కష్టనష్టాలకోర్చి వారందరినీ ప్రయోజకులుగా తీర్చిదిద్దారు.
ఉన్నత విద్య కోసం అనేక మందికి ఆర్థిక సాయం చేశారు. వారంతా ఇప్పుడు ప్రయోజకులుగా ఉన్నారు. ఇక అనేక వ్యవస్థలకు అండగా నిలవడం ద్వారా, ఆయా సంస్థల ఉన్నతికి పాటుపడ్డారు. వందలాదిమందికి ఉపాధి కల్పించే బాటలు వేశారు.
వారి మూడవ కుమారుడు సురేందర్ రెడ్డి హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో సీనియర్ సర్జన్ గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరు గడించారు. అనేక సామాజిక,రాజకీయ సేవా కార్యక్రమాల్లో సురేందర్ రెడ్డి చురుగ్గా పాల్గొంటున్నాడు. మంచి మనసున్న రాజకీయ నేతగా ఎదిగాడు.
. పెద్ద కుమారుడు ప్రతాపరెడ్డి , రెండో కుమారుడు రవీందర్ రెడ్డి పిలిస్తే పలికే వారుగా పేరు గడించారు. తమ వంతు సాయం చేస్తూ ఆ ప్రాంత వాసులకు ఇంటి పెద్ద దిక్కు అయ్యారు. తన వందో ఏట గత నెల 28వ తేదీన ఎల్లారెడ్డి కన్నుమూశారు. ఒక్కసారిగా దమగ్నాపూర్ శోకసంద్రం అయింది. చిన్న ఎల్లారెడ్డి అభిమానులు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పరిసర ప్రాంతాల వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. పెద్ద దిక్కును కోల్పోయామని కంటికి మింటికి ఏకధారగా విలపించారు. చిన్నయల్లారెడ్డి లేని లోటు తీర్చలేనిది.. పూడ్చ లేనిది. ! శనివారం నాడు తోకల చిన్న ఎల్లారెడ్డి దశదినకర్మను దమగ్నాపూర్ లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అనేకమంది రాజకీయనేతరు పారిశ్రామికవేత్తలు విద్యావంతులు ఎల్లారెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ఆయన ఆశయ సాధనకు కట్టుబడి ఉంటామని చెప్పారు.అనేకమందికి పెద్దదిక్కుగా ఉన్న చిన్న ఎల్లారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం!
పోయినోళ్లందరూ మంచోళ్ళు.. ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గుర్తులు!!

Comments
Post a Comment