అధికారుల 'మామూళ్ల' మత్తు?.. అంతమ్మగూడెంలో కాలుష్య కాటు!
అధికారుల 'మామూళ్ల' మత్తు?.. అంతమ్మగూడెంలో కాలుష్య కాటు!
* కమిటీల పేరుతో కలెక్టర్, పిసిబి మెంబర్ సెక్రటరీ కాలయాపన!*
ఫిర్యాదుదారుల గొంతు నొక్కుతున్న TSPCB!
* 11 ఏళ్లుగా సాగుతున్న పోరాటం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న యంత్రాంగం.
* తనిఖీలు వాయిదా వేసి పరిశ్రమలకు 'క్లీన్ చిట్' ఇచ్చే కుట్ర?
(హైదరాబాద్ గూఢచారి)
ప్రజా ఆరోగ్యం కంటే పారిశ్రామికవేత్తల లాభాలే పరమావధిగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (TSPCB) ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరుపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాలుష్యానికి కారణమవుతున్న కంపెనీలు M/S హెజెలో లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (అంతమ్మగూడెం) M/s బృందావన్ లాబొరేటరీస్ (ఎలగిరి) M/S శ్రీ జయ లాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ (మల్కాపూర్) M/S వినీత్ లాబొరేటరీస్ లిమిటెడ్ (మల్కాపూర్) M/S రావూస్ లాబొరేటరీస్ లిమిటెడ్ (దోతీగూడెం) M/S ఎస్ వి ఆర్ లాబొరేటరీస్ (దోతీగూడెం) M/S వి.జె. సాయి కెమ్ (దోతీగూడెం) M/S కెమిక్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (దోతీగూడెం) M/S ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (దోతీగూడెం) M/S ఆర్కిమెడిస్ లాబొరేటరీస్ (దోతీగూడెం) M/S రిషోన్ లాబొరేటరీస్ (ధర్మోజిగూడెం)
ఈ కంపెనీలు విరజిమ్ముతున్న విషవాయువులు, భూగర్భంలోకి వదులుతున్న రసాయన వ్యర్థాలతో అంతమ్మగూడెం మరియు పరిసర గ్రామాలు నరకప్రాయంగా మారాయి. 2015 నుండి అంటే దాదాపు 11 ఏళ్లుగా గ్రామస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోరాడుతున్నా, అధికారులు మాత్రం 'నిమ్మకు నీరెత్తినట్లు' వ్యవహరిస్తుండటం వెనుక కోట్ల రూపాయల 'మామూళ్ల' మత్తు ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్ర కమిటీ నిర్ధారించినా చలనం లేదు!
గత జూన్ 2025 లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) అధికారులు ఇక్కడ తనిఖీలు నిర్వహించి, సదరు లేబరేటరీ పరిశ్రమ తీవ్రమైన కాలుష్యానికి పాల్పడుతోందని తేల్చిచెప్పారు. జిల్లా పిసిబి అధికారులు వచ్చిన ప్రతిసారీ విషవాయువుల వాసనలు వస్తున్నట్లు నివేదికలు ఇచ్చారు. ఇంత జరుగుతున్నా, కేవలం కంటితుడుపుగా నోటీసులు ఇవ్వడం, బ్యాంక్ గ్యారంటీలు జప్తు చేయడం మినహా పరిశ్రమలను మూసివేయడానికి అధికారులు వెనుకాడుతున్నారు. కోట్ల రూపాయల అక్రమార్జన ముందు ఈ కంపెనీలకు లక్షల రూపాయల జరిమానాలు ఒక లెక్కలోనివి కావు.
కలెక్టర్ గారి 'కమిటీ' డ్రామా.. పరిశ్రమలకు క్లీన్ చిట్ ఇచ్చేందుకేనా?
కాలుష్యంపై గ్రామస్థుల ఆందోళనలు ఎక్కువవడంతో, మే 11న జిల్లా కలెక్టర్ గారు ఆర్డీవో (RDO) అధ్యక్షతన 12 మంది సభ్యులతో ఒక కమిటీని వేశారు. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, గడువు ముగిసినా నేటికీ క్షేత్రస్థాయిలో పని ప్రారంభం కాలేదు.
అసలు లూప్‌హోల్ ఇక్కడే ఉంది: పరిశ్రమలు తాము చేస్తున్న నిబంధనల ఉల్లంఘనలను పూర్తిస్థాయిలో కప్పిపుచ్చుకునేందుకు వీలుగా, వారికి సమయం ఇచ్చి, ఆ తర్వాత తనిఖీలు చేసి 'క్లీన్ చిట్' ఇవ్వడానికే అధికారులు కావాలనే కాలయాపన చేస్తున్నారని అత్తమ్మగూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి నేరుగా ఆరోపిస్తోంది.
38 ట్యాంకర్ల రసాయన వ్యర్థాలు ఎటు పోయాయి? పోలీసుల ఉదాసీనత!
గ్రామ సమీపంలో ఉన్న కెమిక్ లైఫ్ సైన్స్ పరిశ్రమ ఏకంగా 38 ట్యాంకర్ల రసాయన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వదిలివేసినట్లు నివేదికలు వచ్చి రెండేళ్లు గడుస్తోంది. కానీ ఆ ప్రమాదకర వ్యర్థాలను ఎక్కడ పడేశారో కనుగొనడంలో పిసిబి అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. అటు శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారులు సైతం "మాకేమీ సంబంధం లేదు" అన్నట్లుగా వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏమిటో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.
ఫిర్యాదుదారుల గొంతు నొక్కుతున్న TSPCB!
పర్యావరణాన్ని కాపాడుతున్నామంటూ టీవీలు, పేపర్లలో గొప్పలు చెప్పుకునే తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయిలో మాత్రం కాలుష్య కారకులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. బాధితులైన గ్రామస్థులు తమ అభ్యంతరాలను, ఆధారాలను సమర్పించడానికి వెళ్తే కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా గొంతు నొక్కుతున్నారు.
తక్షణ డిమాండ్:
కమిటీల పేరుతో డ్రామాలు ఆపాలి. ఇప్పటికే కాలుష్యానికి పాల్పడుతున్నట్లు ఆధారాలతో సహా నిర్ధారణ అయిన పరిశ్రమలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వాటిని తక్షణమే ఇక్కడి నుండి తరలించాలి. లేనిపక్షంలో అత్తమ్మగూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని నిజాల కోసం చూస్తూనే ఉండండి: gudachari.page

Comments
Post a Comment