ఆర్యవైశ్య మహాసభ బై-లాస్‌పై జిల్లా రిజిస్ట్రార్ సీరియస్: 'సొసైటీ చట్టం' ఉల్లంఘనపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు!

 


ఆర్యవైశ్య మహాసభ బై-లాస్‌పై జిల్లా రిజిస్ట్రార్ సీరియస్: 'సొసైటీ చట్టం' ఉల్లంఘనపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు!

హైదరాబాద్ (గూఢచారి విభాగం): తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ సొసైటీ అంతర్గత నియమావళి (Bye-laws), రాష్ట్ర సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టానికి విరుద్ధంగా ఉందంటూ దాఖలైన ఫిర్యాదుపై హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్ (సౌత్) తీవ్రంగా స్పందించారు. తెలంగాణ సొసైటీల రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 లోని సెక్షన్ 14 ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలపై మహాసభ కన్వీనర్ శ్రీ అమరవాది లక్ష్మీనారాయణకు రిజిస్ట్రార్ కార్యాలయం అధికారికంగా ‘షోకాజ్’ నోటీసులు (లేఖ నంబర్ 3144/2026, తేదీ 16-05-2026) జారీ చేసింది.

నల్లగొండకు చెందిన శ్రీ బి. రాజు అనే వ్యక్తి గత నెల 23-04-2026న ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా రిజిస్ట్రార్ కార్యాలయం ఈ చర్యలు చేపట్టింది.

సెక్షన్ 14 ఉల్లంఘన.. అసలు వివాదం ఏమిటి?

సొసైటీల రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా కమిటీలను ఎన్నుకోవాల్సి ఉండగా, మహాసభ నియమాలు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయన్నది ప్రధాన ఆరోపణ.

చట్టం ఏం చెబుతోంది (సెక్షన్ 14): ప్రతి రిజిస్టర్డ్ సొసైటీలో కనీసం ముగ్గురు సభ్యులతో కూడిన కార్యవర్గ కమిటీని జనరల్ బాడీ (సర్వసభ్య సమావేశం) మెజారిటీ ఓట్ల ద్వారా తప్పనిసరిగా ఎన్నుకోవాలి.

మహాసభ బై-లాస్ లోని లోపం: ఆర్యవైశ్య మహాసభ బై-లాస్‌ లోని నిబంధనలు 8(2)(డి) మరియు 9(1) ప్రకారం... సర్వసభ్య సమావేశం కేవలం ‘అధ్యక్షుడిని’ మాత్రమే ఎన్నుకుంటుంది. ఆ ఎన్నికైన అధ్యక్షుడే మిగిలిన కమిటీ సభ్యులందరినీ నేరుగా నియమిస్తారు (నామినేట్ చేస్తారు).

ప్రజాస్వామ్యానికి విరుద్ధం.. మొదటి నుంచీ చెల్లదు!

ఈ నిబంధన చట్ట వ్యతిరేకమని ఫిర్యాదుదారుడు రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు. కేవలం అధ్యక్షుడికే సర్వాధికారాలు కట్టబెట్టడం వల్ల అధికార కేంద్రీకరణ జరుగుతుందని, ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ నిబంధన చట్టపరిధిని దాటినందున (Ultra Vires the Act) మరియు చట్టప్రకారం మొదటి నుంచీ చెల్లనిది (Void ab-initio) గా పరిగణించాలని ఫిర్యాదులో కోరారు. అలాగే, రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ తీవ్రమైన లోపాన్ని గుర్తించకపోవడం రిజిస్ట్రార్ కార్యాలయ విధి నిర్వహణ లోపమేనని ఫిర్యాదుదారుడు వేలెత్తి చూపారు.

7 రోజుల్లో సంజాయిషీ.. లేదంటే చర్యలు తప్పవు!

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఆర్యవైశ్య మహాసభ కమిటీకి కింది అంశాలపై 7 రోజుల్లోగా పూర్తి వివరణాత్మక సమాధానాన్ని, సంబంధిత ఆధార పత్రాల నకళ్లను సమర్పించాలని ఆదేశించారు:

మీ సొసైటీ బై-లాస్ లోని నిబంధనలు 8(2)(డి) & 9(1) తెలంగాణ సొసైటీల రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 లోని సెక్షన్ 14 కు అనుగుణంగానే ఉన్నాయా? లేదా ఉల్లంఘిస్తున్నాయా?

సెక్షన్ 14 ప్రకారం జనరల్ బాడీ చేత మొత్తం కమిటీని ఎన్నుకోకుండా, కేవలం అధ్యక్షుడిని మాత్రమే ఎన్నుకుని, మిగిలిన వారిని నియమించుకోవడం ప్రస్తుతం కొనసాగుతుందా?

ఒకవేళ ఈ బై-లా చట్టానికి విరుద్ధమైతే, సొసైటీని సెక్షన్ 14 ప్రకారం పునర్వ్యవస్థీకరించడానికి, బై-లా లో మార్పులు చేయడానికి అవకాశం ఉందా?

వారంలోగా సంతృప్తికరమైన సమాధానం రాకపోయినా, లేదా వివరణ ఇవ్వడంలో విఫలమైనా చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని జిల్లా రిజిస్ట్రార్ (సౌత్) కార్యాలయం నోటీసులో స్పష్టం చేసింది. ప్రతిష్టాత్మకమైన ఆర్యవైశ్య మహాసభలో బై-లాస్ వివాదం ఇప్పుడు సొసైటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్