అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ
అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి
అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ
* ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం
* వారికి సముచిత ప్రాధాన్యం ఇస్తాం
* శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం విజయవంతం
* వాసవీ పారాయణానికి గిన్నీస్ రికార్డు
హైదరాబాద్: వాసవీ కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ, జయంతి దినోత్సవాలను అధికారికంగా నిర్వహించే విషయంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోగానే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్య వైశ్య సామాజిక వర్గానికి తమ ప్రభుత్వంలో సముచిత గౌరవం ఉంటుందని ఆయన తెలిపారు. వైశ్యులు ఊరికొక్కరు ఉన్నా ఊరందరూ వారితో ఉంటారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వారి సహకారంతోనే రైతులు వ్యవసాయం చేసుకుంటారు న్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వారు వెన్నెముకగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్ర నిర్మాణంలో వైశ్యులది ముఖ్య పాత్ర అని కొనియాడారు.
రాజకీయంగా గుర్తింపు దక్కినా, దక్కకున్నా క్రమ శిక్షణ తప్పకుండా తమ పాత్ర పోషిస్తారన్నారు. అహింస అనే గొప్ప దారిని ప్రపంచానికి చూపిన మహాత్మా గాంధీ వైశ్య జాతిలో జన్మించడం గర్వకారణమని, ఆయన వైశ్యులకే కాదు...అందరికీ ఆదర్శం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి
రోశయ్య అన్నా తనకు ఎంతో అభిమానం అన్నారు. తాము అధికారంలోకి లోగానే ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించామన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రజల ఆలోచనే తమ ప్రభుత్వ విధానమని అన్నారు. వాసవీ పారాయణం గిన్నీస్ ప్రపంచ రికార్డు సాధించినందుకు అభినందనలు తెలిపారు.
ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కల్వ సుజాత మాట్లాడుతూ వాసవీ మాత జయంతి, ఆత్మార్పణ దినోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రిని కోరారు. వాసవీ మహాశక్తి మహోత్సవానికి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వైశ్యుల సంక్షేమానికి తమ కార్పొరేషన్ పక్షాన కృషి చేస్తున్నట్లు తెలిపారు. వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు బెల్ది శ్రీధర్ ప్రసంగించారు. ఆర్యవైశ్యులంతా ఒక్క తాటి పైకి వచ్చిన ఈ సన్నివేశం అద్భుతమన్నారు. ఇది తమ ఐక్యతను చాటుతోందన్నారు.
ప్రముఖ కవి చింతల శ్రీనివాస్ రచించి, స్వరకర్త శ్రీ జోశ్యభట్ల స్వరపరిచిన వాసవీ మాత పారాయణాన్ని గాయని కల్పన పాడగా ఆర్యవైశ్యులు సామూహికంగా పారాయణం చేశారు. ఇది ప్రపంచ రికార్డు సాధించింది.
***
తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి
* ఏపీ మంత్రి టీజీ భరత్
హైదరాబాద్: తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరుతానని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. 2014 నుంచి తెలంగాణలో వైశ్యులకు మంత్రి పదవి దక్కలేదని గుర్తు చేశారు. జనాభా లో దాదాపు 5 శాతం ఉన్న ఆర్య వైశ్యులకు తగిన ప్రాతినిధ్యం దక్కాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
వైశ్యులు ఐకమత్యంతో ఉండి శక్తి చాటితేనే గౌరవం దక్కుతుందన్నారు. క్షేత్ర స్థాయి వాస్తవాలు తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవైశ్యులకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందన్నారు.
అందరు వైశ్యులు కూడా పేరు చివరన గుప్త అని పెట్టుకోవాలని సూచించారు. ప్రజలకు ఆపద వచ్చినప్పుడు ఆదుకునేది ఆర్య వైశ్యులేనన్నారు. అందరూ గోసేవ కూడా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గోసేవ చేసిన ఫలితం గానే తాను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానని చెప్పారు. వాసవీ పారాయణ మహోత్సవాన్ని తలపెట్టిన కల్వ సుజాత గుప్తను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాంప్రసాద్, రాష్ట్ర ఆర్య వైశ్య ప్రముఖులు ఎమ్మెల్సీబొగ్గారపు దయానంద్ , ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా , కోలేటి దామోదర్ గుప్తా, ఉప్పల శ్రీనివాస్ గుప్తా , బిగాల గణేష్ గుప్తా , చీకోటి ప్రవీణ్ , మలిపెద్ది శంకర్, రాజమౌళి , కేసీపీ అనిల్ కౌటికె విఠల్ , రావికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment