# చార్‌ధామ్ యాత్రకు రైలు మార్గం.. రిషికేశ్–కర్ణప్రయాగ్ ప్రాజెక్టులో 6.59 కి.మీ. టన్నెల్ పూర్తి!
# చార్‌ధామ్ యాత్రకు రైలు మార్గం.. రిషికేశ్–కర్ణప్రయాగ్ ప్రాజెక్టులో 6.59 కి.మీ. టన్నెల్ పూర్తి!
## హిమాలయాల్లో మరో కీలక మైలురాయిని అధిగమించిన మేఘా ఇంజినీరింగ్
**హైదరాబాద్, నవంబర్ 27:**
ఉత్తరాఖండ్‌లోని పవిత్ర చార్‌ధామ్ క్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి యాత్రలకు వెళ్లే భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. రిషికేశ్–కర్ణప్రయాగ్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా 6.59 కిలోమీటర్ల పొడవైన టన్నెల్–14 తవ్వకాలను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) విజయవంతంగా పూర్తి చేసింది.
రుద్రప్రయాగ్ జిల్లాలో హిమాలయ పర్వతాల క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, ప్రతికూల వాతావరణాన్ని అధిగమిస్తూ రెండు వైపుల నుంచి చేపట్టిన తవ్వకాలను విజయవంతంగా అనుసంధానించి బ్రేక్‌త్రూ సాధించింది. సుమేర్‌పూర్ వైపు 4.7 కిలోమీటర్లు, మారోరా వైపు 1.79 కిలోమీటర్ల మేర తవ్వకాలు చేపట్టారు.
ఈ సొరంగ నిర్మాణంలో వదులైన మట్టి, కొండచరియల స్థిరత్వం, నివాస ప్రాంతాల భద్రత వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, కార్మికుల సమష్టి కృషితో ఈ ఘనత సాధ్యమైంది.
రిషికేశ్–కర్ణప్రయాగ్ రైల్వే ప్రాజెక్టు పూర్తయితే చార్‌ధామ్ యాత్రికులకు పర్వత ప్రాంతాల వరకు రైలు మార్గం ద్వారా చేరుకునే సౌకర్యం మెరుగుపడనుంది. రహదారులపై రద్దీ, ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఉత్తరాఖండ్‌లో పర్యాటక రంగం, స్థానిక వ్యాపారాలు, ఉపాధి అవకాశాలకు ఊతం లభించనుంది.
ఇదే ఏడాది జూన్‌లో జోజిలా టన్నెల్ బ్రేక్‌త్రూ సాధించిన MEIL, తాజాగా రిషికేశ్–కర్ణప్రయాగ్ ప్రాజెక్టులో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. హిమాలయాల వంటి అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో భారీ నిర్మాణాలను చేపట్టగల సంస్థ సాంకేతిక సామర్థ్యానికి ఈ విజయం నిదర్శనంగా నిలిచింది.

Comments
Post a Comment