శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ పంజా: రూ.30 లక్షల డిమాండ్.. రూ.2 లక్షలు నొక్కేస్తూ డ్రైవర్, ఎమ్మార్వో రెడ్ హ్యాండెడ్!
శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ పంజా: రూ.30 లక్షల డిమాండ్.. రూ.2 లక్షలు నొక్కేస్తూ డ్రైవర్, ఎమ్మార్వో రెడ్ హ్యాండెడ్!
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయం మరోసారి అవినీతి అక్రమాలకు అడ్డాగా మారింది. భూమి కన్వర్షన్ కోసం ఏకంగా రూ.30 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఉదంతంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించి గుట్టు రట్టు చేశారు.
రూ.30 లక్షల డీల్.. ఎకరానికి లక్ష చొప్పున వేట!
శామీర్‌పేట మండలం ఆలియాబాద్ ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమిని కన్వర్షన్ (ల్యాండ్ కన్వర్షన్) చేయడానికి సంబంధించి ఒక రైతు కన్సల్టెంట్ నుంచి ఇక్కడి అధికారులు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. ఎకరానికి రూ.1 లక్ష చొప్పున.. మొత్తం రూ.30 లక్షలు ఇస్తేనే పని జరుగుతుందని కరాఖండిగా చెప్పారు. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో వ్యూహాత్మకంగా నిఘా పెట్టారు.
డ్రైవర్ ద్వారా వసూళ్లు.. రెడ్ హ్యాండెడ్‌గా!
లంచం మొత్తంలో భాగంగా మొదటి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. తహసీల్దార్ (ఎమ్మార్వో) తరఫున ఆమె డ్రైవర్ ఈ డబ్బును తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కీలక అధికారుల విచారణ:
ఈ అవినీతి నెట్‌వర్క్‌పై లోతుగా దర్యాప్తు చేయడానికి కార్యాలయంలోని కీలక పత్రాలు, భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుత తహసీల్దార్ (ఎమ్మార్వో) సుచరితతో పాటు, కీసర ఆర్డీఓ రాజేష్, మరికొంతమంది కార్యాలయ సిబ్బందిని ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు.
ఇది ‘రిపీట్’ కథ.. 2024 సీన్ మళ్లీ రీక్రియేట్!
శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయానికి, లంచాలకి విడదీయరాని బంధం ఉందా? అనే అనుమానాలు కలగక మానవు. ఎందుకంటే.. గతంలో 2024లో కూడా ఇదే కార్యాలయంలో పని చేసిన అప్పటి ఎమ్మార్వో సత్యనారాయణ సరిగ్గా ఇలాగే రూ.2 లక్షల లంచం కేసులో తన డ్రైవర్‌తో సహా ఏసీబీకి దొరికిపోయారు.
అప్పట్లో ఆ ఘటన తీవ్ర సంచలనం సృష్టించగా.. ఇప్పుడు క్యారెక్టర్లు మారినా, అదే కార్యాలయంలో, అదే డ్రైవర్ల స్క్రీన్ ప్లేతో మళ్లీ ఏసీబీ దాడులు జరగడం జిల్లావ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.
గుడాచారి కామెంట్:
ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు మారుతున్నా శామీర్‌పేట తహసీల్దార్ ఆఫీసులో లంచాల పర్వం మాత్రం మారడం లేదు. 'డ్రైవర్లను' ముందు పెట్టి తెర వెనుక చక్రం తిప్పే పెద్దల గుట్టును ఏసీబీ పూర్తిగా లాగాల్సిన అవసరం ఉంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం ఇలాంటి అవినీతి తిమింగలాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి!
(మరిన్ని బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి - gudachari.page)

Comments
Post a Comment