ACB కి చిక్కిన, బిల్ కలెక్టర్, బీట్ ఆఫీసర్
గుండాల ఫారెస్ట్ రేంజ్‌లో ACB దాడి:
30-04-2026 తేదీన నడిమిగూడెం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీ బానోత్ నరేష్, ప్రస్తుతం సాయనపల్లి ఇన్‌చార్జ్‌గా కూడా విధులు నిర్వహిస్తున్నాడు. గుండాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని తన కార్యాలయంలో రూ.10,000 లంచం తీసుకుంటూ ACB అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
వెంకటపురం రెవెన్యూ గ్రామంలో ఉన్న సుమారు 5 ఎకరాల పట్టా పోడు భూమిని, ప్రభుత్వం ఫిర్యాదుదారుడి తండ్రికి కేటాయించినప్పటికీ, ఆ భూమి సాగులో జోక్యం చేసుకోకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.10,000 స్వీకరిస్తుండగా అధికారులు అతన్ని పట్టుకున్నారు.
అధికారుల సమాచారం ప్రకారం, లంచం మొత్తాన్ని నిందితుడి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో అవినీతి ప్రవర్తన ప్రదర్శించి అన్యాయ లాభం పొందేందుకు ప్రయత్నించినందుకు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
తదుపరి చర్యల భాగంగా నిందితుడిని అరెస్ట్ చేసి, వరంగల్‌లోని SPE & ACB కేసుల ప్రత్యేక కోర్టు, మూడవ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి ముందు హాజరుపరచనున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
గూఢచారి: సదాశివపేట:
సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట పట్టణంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు దాడి చేసి మున్సిపల్ కార్యాలయానికి చెందిన బిల్ కలెక్టర్‌ను ఏప్రిల్ 30 న లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే, మున్సిపల్ కమిషనర్ కార్యాలయం, సదాశివపేటలో అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న బిల్ కలెక్టర్ మంతూర్ నిఖిల్ రెడ్డి, ఒక ఫిర్యాదుదారుని ఇంటి పన్ను తగ్గింపు కోసం లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఫిర్యాదుదారుని ఇంటికి సంబంధించిన పన్నును ₹1,04,480 నుండి ₹49,892కు తగ్గించేందుకు సహకరిస్తానని చెప్పి మొదటగా ₹35,000 లంచం కోరాడు. అందులో భాగంగా ఇప్పటికే ₹20,000 తీసుకున్నాడు.
మిగిలిన ₹15,000 లంచం తీసుకుంటున్న సమయంలో, ఏసీబీ అధికారులు పన్నాగం పన్ని, ఫిర్యాదుదారుని నివాసంలోనే నిఖిల్ రెడ్డిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి లంచంగా తీసుకున్న నగదు స్వాధీనం చేసుకున్నారు.
తన అధికార బాధ్యతలను దుర్వినియోగం చేసి, అన్యాయ లాభం పొందేందుకు ప్రయత్నించినందుకు నిందితుడిని అరెస్ట్ చేసి, హైదరాబాద్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు పై దర్యాప్తు కొనసాగుతోంది.
ఫిర్యాదుదారుని వివరాలు భద్రతా కారణాల వల్ల గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.



Comments
Post a Comment