ఆర్&బి ఈఈ సంధ్య అక్రమాస్తులపై ఏసీబీ విచారణ జరపాలి: సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ డిమాండ్
ఆర్&బి ఈఈ సంధ్య అక్రమాస్తులపై ఏసీబీ విచారణ జరపాలి: సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ డిమాండ్
ఈఎన్‌సీ మోహన్ నాయక్ నివాసాలపై ఏసీబీ దాడులను స్వాగతిస్తున్నాం
ఒకే జిల్లాలో 20 ఏళ్లుగా తిష్టవేసిన సంధ్య అవినీతిపై పోరాడుతాం
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, కళాభారతి పనులపై విజిలెన్స్ విచారణ జరపాలి
మహబూబ్‌నగర్ (జిల్లా కేంద్రం):
తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ (R&B) ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ) మోహన్ నాయక్ ఆస్తులపై ఏసీబీ అధికారులు నిర్వహించిన మెరుపు దాడులను స్వాగతిస్తున్నామని 'నేనుసైతం' స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మియాపూర్‌లోని ఈఎన్‌సీ మోహన్ నాయక్ నివాసంతో పాటు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టడం హర్షణీయమన్నారు. ఇదే తరుణంలో, మహబూబ్‌నగర్ జిల్లా ఆర్&బి శాఖలో గత 20 సంవత్సరాలుగా ఇక్కడే తిష్టవేసి పనిచేస్తున్న ఈఈ (EE) సంధ్య ఆస్తులపై కూడా సమగ్ర ఏసీబీ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా సర్వీస్:
సీసీఏ సర్వీస్ రూల్స్ 1991కు పూర్తిగా విరుద్ధంగా, ప్రభుత్వ నిబంధనలను బేఖాతారు చేస్తూ ఈఈ సంధ్య గత రెండు దశాబ్దాలుగా మహబూబ్‌నగర్ జిల్లాలోనే విధులు నిర్వహిస్తున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆమె హయాంలో జరిగిన మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్ నిర్మాణం, బైపాస్ రోడ్డు, కళాభారతి పనులతో పాటు ఆమె పర్యవేక్షణలో చేపట్టిన పలు అభివృద్ధి పనులలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ధ్వజమెత్తారు.
ఉన్నతాధికారులకు, సీఎంకు ఫిర్యాదు:
సంధ్య ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా చేపట్టిన అన్ని పనులకు సంబంధించి ఏసీబీ, విజిలెన్స్ మరియు ఇతర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ అవినీతి వ్యవహారాలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఆర్&బి ఉన్నతాధికారులు, ఈఎన్‌సీ, ప్రిన్సిపల్ సెక్రటరీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మరియు సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినట్లు వెల్లడించారు.
ఈఈ సంధ్య అక్రమ సంపాదన, అవినీతిపై ఏసీబీ అధికారులు తక్షణమే స్పందించి విచారణ ప్రారంభించాలని, ఆమె అక్రమాస్తులను సీజ్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని దిడ్డి ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

Comments
Post a Comment