*ప్రక్షాళన కమిటీ విజయం - పేద ఆర్యవైశ్య బిడ్డలకే ఆత్మగౌరవ భవన్ ఉపయోగపడాలన్న సీఎం రేవంత్ రెడ్డి*
*హైదరాబాద్:* ఉప్పల్ భగాయత్ లో ఆదివారం జరిగిన ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్ భూమి పూజ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆర్యవైశ్య వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీన్ని *మహాసభ ప్రక్షాళన కమిటీ తొలి విజయం* గా చెప్పుకోవచ్చు.
సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి *"నిర్మిస్తున్న ఈ ఆత్మగౌరవ భవన్ పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఉపయోగపడాలి. ఆర్యవైశ్యులంతా కలిసి ఉండండి, రాజకీయాల్లో రాణించండి"* అని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఆర్యవైశ్యులు పేదలకు ఎలాంటి పూచీ లేకుండా ఉద్దెర ఇచ్చి ఆదుకుంటారని కొనియాడారు. ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని, కొడంగల్ మున్సిపల్ చైర్మెన్ ఆర్యవైశ్యలకే ఇచ్చామని తెలిపారు. ఆత్మగౌరవ భవన్ కు ఆర్థిక సహాయం కోరారని, నిబంధనల మేరకు చేస్తామని తెలిపారు.
*ఎందుకు ఇది ప్రక్షాళన కమిటీ విజయం?*
గత కొన్ని నెలలుగా మహాసభ ప్రక్షాళన కమిటీ లేవనెత్తుతున్న ప్రధాన డిమాండ్ ఇదే. కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న భవన్ కేవలం కొందరు పెద్దలకోసం, ఫంక్షన్ హాల్ గా మిగిలిపోకుండా.. పేద, మధ్యతరగతి ఆర్యవైశ్య విద్యార్థులకు, నిరుపేద కుటుంబాలకు ఉపయోగపడేలా నిబంధనలు ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఆ డిమాండ్ ను మహాసభ పాలకవర్గం పట్టించుకోకపోయినా, ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి నోటి నుండే అదే మాట రావడం ప్రక్షాళన కమిటీ పోరాటానికి దక్కిన విజయమని సామాన్య ఆర్యవైశ్యులు చెబుతున్నారు.
*సీఎం పరోక్ష హెచ్చరిక!*
సీఎం తన ప్రసంగంలో *"ఇక్కడ సభలో ఉన్నవారు కానీ, బయట ఉన్నవారు కానీ అందరూ కలిసి ఉండాలి"* అని అనడం గమనార్హం. బయట ఉన్నవారు అంటే ప్రక్షాళన కమిటీ సభ్యులను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్య చేశారనే చర్చ జరుగుతోంది. అందరినీ కలుపుకుపోవాలని పాలకవర్గానికి పరోక్షంగా హెచ్చరిక చేసినట్లేనని అంటున్నారు.
*మొత్తంగా చూస్తే..*
ఒకవైపు మహాసభ పాలకవర్గం ముఖ్యమంత్రితో భూమి పూజ చేయించి తమ బలాన్ని చాటుకుంటే.. మరోవైపు ప్రక్షాళన కమిటీ తమ డిమాండ్ ను సీఎం చేతే చెప్పించి తమ వాయిస్ ను వినిపించింది. ఇది ఆర్యవైశ్య సమాజం మొత్తం విజయమే.
సీఎం సూచించినట్లు ఇకనైనా అందరూ ఒక్కటై పేద ఆర్యవైశ్యుల అభివృద్ధికి, రాజకీయంగా బలపడటానికి కృషి చేయాలని సామాన్య ఆర్యవైశ్యుడు ఎదురుచూస్తున్నాడు.

Comments
Post a Comment