*ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలి - జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్*

 



*ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలి - జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్*


*నల్గొండ:* ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ పాలకవర్గ సభ్యులందరూ నిబద్ధతతో, సమష్టి కృషితో ప్రజాసేవకు అంకితం కావాలని జిల్లా కలెక్టర్ *బి. చంద్రశేఖర్* అన్నారు. సమాజ సేవలో రెడ్‌క్రాస్ పాలకవర్గం కీలక పాత్ర పోషించాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజంలోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.


శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్‌లో నిర్వహించిన జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.


నూతనంగా ఎన్నుకోబడిన పాలకవర్గ సభ్యులకు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రెడ్‌క్రాస్ సొసైటీకి సమాజంలో ప్రత్యేక గుర్తింపు, విశ్వసనీయత ఉన్నాయని అన్నారు. సంస్థ ద్వారా చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేలా ఉండాలని, బాధ్యతలు స్వీకరించిన సభ్యులు సంస్థ నియమ నిబంధనలు, నైతిక విలువలను పాటిస్తూ ముందుకు సాగాలన్నారు.


*నషాముక్త్ భారత్‌లో రెడ్‌క్రాస్ భాగస్వామ్యం*


యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా నషాముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో రక్తహీనత నిర్మూలనకు రెడ్‌క్రాస్ సొసైటీ భాగస్వామ్యం కావాలని, ముఖ్యంగా బాలికలు, గర్భిణులు, చిన్నారుల్లో రక్తహీనత నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అన్నారు.


జిల్లాలో రక్త నిల్వల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ సేవలను మరింత బలోపేతం చేయాలని, విద్యాసంస్థలు, వివిధ సంస్థల సహకారంతో రక్తదాన శిబిరాలు, రక్తదాతల గుర్తింపు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.


*యువతకు కలెక్టర్ సూచనలు*


యువత సోషల్ మీడియాను పరిమితంగా, బాధ్యతాయుతంగా వినియోగించాలని కలెక్టర్ సూచించారు. ఆన్‌లైన్ పరిచయాలు, స్నేహాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత భద్రత, గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఎవరైనా మాదకద్రవ్యాలను అందించే ప్రయత్నం చేసినా, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనా వెంటనే తల్లిదండ్రులు, కళాశాల ప్రిన్సిపాల్ లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.


కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు.


*నర్సింగ్ విద్యార్థులకు విదేశీ అవకాశాలు*


నర్సింగ్ విద్యార్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జపాన్, జర్మనీ వంటి దేశాల్లో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయని, విద్యార్థులు తమ పరిధిని విస్తరించుకొని విదేశీ భాషలైన జపనీస్, జర్మన్ భాషలను నేర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ సహకారంతో విదేశీ భాషల శిక్షణ కార్యక్రమాలను డిసెంబర్ నెలలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.


*పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ*


సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతి ఒక్కరూ సుస్థిర జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మార్కెట్‌కు వెళ్లేటప్పుడు ప్లాస్టిక్ సంచులకు బదులుగా వస్త్ర సంచులు ఉపయోగించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నివారించాలని, ప్రయాణాల్లో సొంత వాటర్ బాటిళ్లు తీసుకెళ్లాలని సూచించారు. వేడుకల్లో ఆహారాన్ని వృథా చేయకుండా అవసరమైనంత మాత్రమే తీసుకోవాలని తెలిపారు. సాధ్యమైనంత వరకు పర్యావరణహిత రవాణా మార్గాలను ప్రోత్సహించాలని, ఉపయోగించిన పుస్తకాలను ఇతర విద్యార్థులకు అందించడం ద్వారా పునర్వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరారు.


రానున్న కాలంలో ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో మార్పులు, వర్షపాతం లోటు వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్న నేపథ్యంలో నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, ఈ విషయంపై విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు.


రెడ్‌క్రాస్ నూతన చైర్మన్ *డాక్టర్ హేమలత* మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని చెప్పారు.


ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ వైస్ చైర్మన్ *శ్రీకాంత్, డాక్టర్ పుల్లారావు*, రాష్ట్ర కమిటీ సభ్యుడు *మంచుకొండ బిక్షమయ్య, కుంభం జ్యోతి రెడ్డి*, గుంటి రామకృష్ణ, పరమాత్మ ఇతర పాలకవర్గ సభ్యులు, నర్సింగ్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, సంస్థ ప్రతినిధులు, ఇతరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

# వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్‌లో మాజీ అధ్యక్షుడి కి షాక్? ## అవినీతి ఆరోపణలపై క్రిమినల్ చర్యలకు ప్రస్తుత బాడీ సిద్ధం?

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు