హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు ఆమోదం కోరిన సీఎం రేవంత్ రెడ్డి – కేంద్ర భాగస్వామ్యం కోరుతూ విజ్ఞప్తి
హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు ఆమోదం కోరిన సీఎం రేవంత్ రెడ్డి – కేంద్ర భాగస్వామ్యం కోరుతూ విజ్ఞప్తి
📍 న్యూ ఢిల్లీ | తేదీ: 06-05-2026, గూఢచారి:
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం న్యూ ఢిల్లీలో కేంద్ర గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలుసుకుని హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్–2 ప్రాజెక్టుకు తక్షణ ఆమోదం ఇవ్వాలని కోరారు.
ఫేజ్–2కు సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని సీఎం తెలిపారు. ఈ దశలో మొత్తం 7 కారిడార్లతో 122.9 కిలోమీటర్ల పొడవున మెట్రో నిర్మాణం చేపట్టనున్నట్లు, దానికి సుమారు ₹38,595 కోట్ల వ్యయం అవుతుందని వివరించారు.
ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి కావాలంటే కేంద్రం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి జాయింట్ వెంచర్‌గా భాగస్వామ్యం కావాలని సీఎం కోరారు.
హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలు పెరుగుతున్నాయని, మెట్రో నెట్‌వర్క్ విస్తరణ అత్యవసరమని సీఎం స్పష్టం చేశారు.
ఇప్పటికే ఫేజ్–1 ప్రాజెక్టును ఎల్ & టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఫేజ్–2, ఫేజ్–3 పనులు మరింత సులభంగా, సమర్థవంతంగా అమలు అవుతాయని చెప్పారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం–భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్‌ను ఫేజ్–3లో పరిగణనలోకి తీసుకోవాలని కూడా కేంద్రాన్ని కోరారు. ఫేజ్–3 DPR కూడా సమర్పించామని తెలిపారు.
ఈ సమావేశంలో కేంద్ర గృహనిర్మాణ శాఖ కార్యదర్శి కె. శ్రీనివాస్, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ సలహాదారు ఎన్.వి.ఎస్. రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments
Post a Comment