*"చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు అప్రోచ్ రోడ్ల సమస్య - సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ"*
*"చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు అప్రోచ్ రోడ్ల సమస్య - సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ"*
*"రూ.430 కోట్లతో కొత్త టర్మినల్... కానీ రోడ్లు లేక రాకపోకలకు అంతరాయం"*
"గూఢచారి" *తేదీ: 04-05-2026* *హైదరాబాద్:* నగరంలో పెరుగుతున్న జనాభా, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు అప్రోచ్ రోడ్ల విస్తరణ, పార్కింగ్ సౌకర్యాల కోసం అవసరమైన భూమి కేటాయించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
*లేఖలోని కీలక అంశాలు:*
* చర్లపల్లి టర్మినల్‌కు రోడ్డు కష్టాలు:*
హైదరాబాద్‌లోని కాచిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే టెర్మినళ్లపై భారం తగ్గించేందుకు నగర శివార్లలోని చర్లపల్లిలో రూ.430 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త రైల్వే టర్మినల్‌ను అభివృద్ధి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా 6 జనవరి 2025న దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
కొత్త టర్మినల్ ప్రారంభం తర్వాత రోజుకు కొన్ని పదుల సంఖ్యలో రైళ్లు చర్లపల్లి నుంచి సేవలు అందిస్తున్నాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే స్టేషన్‌కు ఇరువైపులా ప్రయాణికులు, వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా అప్రోచ్ రోడ్లను విస్తరించాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
* FCI గోడౌన్ రోడ్డు విస్తరణ కీలకం:*
FCI గోడౌన్ రోడ్డు నుంచి కొత్తగా నిర్మించిన స్టేషన్ బిల్డింగ్ వైపు 200 అడుగుల వెడల్పుతో రోడ్డును విస్తరించాలని లేఖలో కోరారు. భవిష్యత్తులో ఈ రహదారి చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు ప్రధాన రహదారిగా మారుతుందని తెలిపారు.
*పార్కింగ్‌కు భూసేకరణ:*
పార్కింగ్ తదితర అవసరాల కోసం స్టేషన్‌కు ఇరువైపులా అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
* సికింద్రాబాద్ స్టేషన్ రోడ్డు విస్తరణ:*
చర్లపల్లితో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అప్రోచ్ రోడ్డు విస్తరణ గురించి కూడా లేఖలో ప్రస్తావించారు. నగరంలోని మూడు ప్రధాన టెర్మినళ్లపై అధిక భారం పడుతున్న నేపథ్యంలో ఈ రెండు స్టేషన్ల అనుసంధాన రోడ్లు మెరుగుపరిస్తే ప్రయాణికులకు ఉపశమనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
రోజురోజుకూ పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం చర్లపల్లి టర్మినల్‌ను అభివృద్ధి చేసింది. అయితే స్టేషన్ వరకు చేరుకునే రోడ్లు ఇరుకుగా ఉండటం, పార్కింగ్ స్థలం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని కేంద్ర మంత్రి లేఖ ద్వారా స్పష్టం చేశారు.
కేంద్రం నిధులతో టర్మినల్ కట్టినా, లాస్ట్ మైల్ కనెక్టివిటీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. భూసేకరణ, రోడ్డు విస్తరణ వేగవంతం చేస్తేనే రూ.430 కోట్ల పెట్టుబడికి సార్థకత. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే అధికారులతో సమీక్ష జరిపి భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తే హైదరాబాద్ ప్రయాణికులకు మేలు జరుగుతుంది.

Comments
Post a Comment