రసాయన కాలుష్యంపై అంతమ్మగూడెం వాసుల పోరాటం - స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కు వినతి

 



రసాయన కాలుష్యంపై అంతమ్మగూడెం వాసుల పోరాటం 

- స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కు వినతి

కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని స్పీకర్ హామీ

మద్దతుగా నిలిచిన ప్రముఖ పర్యావరణవేత్తలు పురుషోత్తం రెడ్డి, దొంతి నరసింహారెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ పరిధిలోని రసాయన పరిశ్రమల వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర కాలుష్య సమస్యలపై "అంతమ్మగూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి" సమరశంఖం పూరించింది. హజేలో తదితర పరిశ్రమల నుండి వెలువడుతున్న రసాయన వ్యర్థాల వల్ల పీల్చే గాలి, త్రాగే నీరు, తినే పంటలు, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయి గ్రామంలో జీవనం అస్తవ్యస్తంగా మారిందని, ఆరోగ్యం క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ సమితి సభ్యులు బుధవారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ గ్రామాన్ని కాలుష్యం బారి నుండి కాపాడాలని వేడుకున్నారు. ప్రముఖ పర్యావరణవేత్తలు కుంభం పురుషోత్తం రెడ్డి, దొంతి నరసింహారెడ్డి ల సహకారంతో స్పీకర్‌కు ఓ సమగ్ర వినతిపత్రాన్ని అందజేశారు.

*ప్రజా సమస్యలపై స్పీకర్ సానుకూల స్పందన*
గ్రామస్తుల ఇబ్బందులు, కాలుష్య తీవ్రతను సావధానంగా విన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దీనిపై సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, అలాగే పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారుల ద్వారా తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన చేయించి, సమస్య శాశ్వత పరిష్కారానికి గట్టిగా కృషి చేస్తానని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. స్పీకర్‌ కు వినతిపత్రం సమర్పించిన వారిలో అంతమ్మగూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి ప్రతినిధులు గుమ్మి దామోదర్ రెడ్డి, రావుల బాల్ రెడ్డి, రావుల రాంరెడ్డి, మహేష్, నరసింహలతో పాటు మహిళా ప్రతినిధులు ధనలక్ష్మి, రేణుక, శారదమ్మ, అలివేలు, ముత్తమ్మ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్