చెత్తబుట్టలో ఉండాల్సినవి డైనింగ్ టేబుల్‌పై..! హైదరాబాద్ రెస్టారెంట్ల అసలు రూపం బహిర్గతం

 


చెత్తబుట్టలో ఉండాల్సినవి డైనింగ్ టేబుల్‌పై..! హైదరాబాద్ రెస్టారెంట్ల అసలు రూపం బహిర్గతం

హైదరాబాద్, జూన్ 23: నగరంలో బయట భోజనం చేసే వారిని కలవరపెట్టే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు జూన్ నెలలో నిర్వహించిన తనిఖీల్లో పరిశీలించిన రెస్టారెంట్లలో అత్యధిక శాతం సంస్థలు ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. తనిఖీ చేసిన ప్రతి 10 రెస్టారెంట్లలో దాదాపు 9 రెస్టారెంట్లలో అపరిశుభ్రత, కుళ్లిన ఆహార పదార్థాల వినియోగం, కీటకాల సమస్యలు, లైసెన్సింగ్ లోపాలు వంటి తీవ్ర అవకతవకలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.

మదీనాగూడలోని అంతేరా రెస్టారెంట్‌లో బూజు పట్టిన కూరగాయలు, పదేపదే ఉపయోగిస్తున్న వంటనూనె, లేబుల్స్ లేని ఆహార పదార్థాలు గుర్తించారు. లులు హైపర్‌మార్కెట్‌లో అపరిశుభ్రత కారణంగా సుమారు 150 కిలోల ఆహారాన్ని అధికారులు నిర్వీర్యం చేశారు. అక్కడ డ్రైనేజీలు బ్లాక్ కావడం, కీటకాలు తిరగడం, గడువు ముగిసిన ఉత్పత్తులు నిల్వ ఉంచడం వంటి లోపాలు కనిపించాయి.

మూసాపేటలోని ఉడిపి ఉపహార్‌లో డ్రైనేజీ సమస్యలు, మూతలేని చెత్తబుట్టలు, కీటకాల ఉనికి, గడువు ముగిసిన లైసెన్స్‌తో కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. మాదాపూర్‌లోని చౌమన్ రెస్టారెంట్‌లో అపరిశుభ్రమైన మాంసం నిల్వ చేయడం, శాకాహార–మాంసాహార పదార్థాలను కలిపి ఉంచడం వెలుగులోకి వచ్చింది.

మదీనాగూడలోని జిస్మత్ జైల్ మండిలో ఆహార పదార్థాలకు సరైన లేబులింగ్ లేకపోవడం, నిల్వ ప్రమాణాలు పాటించకపోవడం, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకపోవడం బయటపడింది. గచ్చిబౌలిలోని రాయల్ స్పైసీలో కీటకాలు, దుర్వాసన, నిల్వ నీరు, అపరిశుభ్రమైన వంటశాల పరిస్థితులు గుర్తించారు.

కొండాపూర్‌లోని సబ్‌వే ఔట్‌లెట్‌లో కుళ్లిన కూరగాయలు, లేబుల్స్ లేని ఆహార పదార్థాలు, వ్యర్థాల నిర్వహణలో లోపాలు ఉన్నట్లు తేలింది. జూబ్లీ ఎన్‌క్లేవ్‌లోని లా పినోజ్ పిజ్జాలో బొద్దింకలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు కనిపించాయి.

అలాగే ది స్పైస్ కిచెన్, ది నవాబ్స్, బ్రౌన్ బేర్ బేకర్స్, బహార్ కేఫ్ వంటి పలు సంస్థల్లో కుళ్లిన ఆహారం, బొద్దింకలు, అపరిశుభ్రమైన నిల్వ విధానాలు, ఓపెన్ టాయిలెట్లు, సిబ్బంది వైద్య రికార్డుల లేమి వంటి అనేక లోపాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఆరోగ్యంతో చెలగాటం..!

నేటి బిజీ జీవితంలో బయట భోజనం చేయడం అలవాటుగా మారిపోయింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి రెస్టారెంట్లలో గడిపే సమయం ఆనందాన్నిచ్చినా, ఆహార నాణ్యతపై నిర్లక్ష్యం ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బయటకు ఆకర్షణీయంగా కనిపించే వంటకాల వెనుక అపరిశుభ్రమైన కిచెన్లు, కుళ్లిన పదార్థాలు, నిబంధనలకు విరుద్ధమైన నిల్వ విధానాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలను మరింత ముమ్మరం చేస్తుండగా, వినియోగదారులు కూడా ఆహారం తీసుకునే ముందు పరిశుభ్రత, నాణ్యత అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో బయటపడుతున్న ఈ వరుస ఘటనలు ఆహార భద్రత విషయంలో రెస్టారెంట్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్