*స్థానిక పత్రికలతోనే సమాజ నిర్మాణం* - సంఘ్ క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ జీ
*స్థానిక పత్రికలతోనే సమాజ నిర్మాణం*
ప్రపంచానికి దిశానిర్దేశం చేసేలా భారత్‌ను విశ్వగురువుగా మలిచేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రతిపాదించిన పంచపరివర్తన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఉత్తమ భారతీయ సమాజాన్ని రూపొందించుకోవలసిన అవసరం ఉందని సంఘ్ క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ జీ పేర్కొన్నారు. భాగ్యనగర్‌లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలో "సమాచార భారతి" సంస్థ ఆధ్వర్యంలో ''స్థానిక పత్రికలు - సమాజ నిర్మాణం'' అంశంపై ఆదివారం జరిగిన ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో ఆయన ప్రధానవక్తగా పాల్గొన్నారు. సంఘ్ క్షేత్ర ప్రచార ప్రముఖ్ నడింపల్లి ఆయుష్ జీ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణలోని పలు జిల్లాల నుంచి 30కి పైగా వివిధ స్థానిక పత్రికల సంపాదకులు, పాత్రికేయులు పాల్గొని విశేష స్పందన కనబరిచారు.
సంఘం ప్రధానంగా మార్పును, పరిణామాన్ని కోరుతున్నదని, ఇవి వ్యక్తి నుంచి ప్రారంభం కావాలని, దేశ నిర్మాణం లక్ష్యంగా ఇటువంటి వ్యక్తి నిర్మాణం అనేది సంఘ్ శాఖలలో జరుగుతున్నదని భరత్ కుమార్ వివరించారు. ఇలాంటి వ్యక్తులతో కూడిన కుటుంబమే దేశానికి వెన్నెముక అన్నారు. సంఘ్ ప్రస్తుతం 90 వేలకు పైగా శాఖలు, లక్షా 50 వేలకు పైగా వివిధ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ భారతీయ సంస్కృతి విలువలను చాటి చెబుతోందన్నారు. ఆధునీకరణ అంటే పాశ్చాత్యీకరణ కాదంటూ మన దేశం పరమ వైభవ స్థితిని అందుకునేందుకు అనుసరించాల్సిన విలువలను తెలియజేశారు.
సమాచార భారతి ఉపాధ్యక్షులు జీ వల్లీశ్వర్ జీ మాట్లాడుతూ స్థానిక పత్రికల ప్రాధాన్యతను వివరించారు. స్థానిక పత్రికలకు ఉన్న శక్తి ప్రధాన స్రవంతిలోని జాతీయ మీడియాకు కూడా లేదని స్పష్టం చేశారు. ఏ ప్రాంత ప్రజలైనా ముందుగా తమ ఊరిలో, తాముంటున్న చోట ఏం జరుగుతోందనే సమాచారం తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారని, వీరిని ప్రభావితం చేసే శక్తి స్థానిక పత్రికలకు మాత్రమే ఉందంటూ పాత్రికేయునిగా తన అనుభవాలను ఈ కార్యక్రమంలో తెలియజేశారు. ప్రభుత్వాలు ఏ పథకం ప్రవేశపెట్టినా, ఏ నిర్ణయం తీసుకున్నా వాటి వల్ల ఆ ప్రాంతానికి లేదా ఊరికి కలిగే ప్రయోజనాలు, సమస్యల గురించి స్థానిక పత్రికల ద్వారానే ఆ అక్కడి వారికి ప్రముఖంగా తెలుస్తుందన్నారు. స్థానిక సమస్యల పరిష్కారంలోను, స్థానిక ప్రజల ప్రయోజనాలకు పెద్ద పీట వేయడంలోను స్థానిక పత్రికలదే కీలక పాత్ర అని వల్లీశ్వర్ తేల్చి చెప్పారు
సంఘ్ తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ రాజగోపాల్ జీ మాట్లాడుతూ సమాచార భారతి సంస్థ ఆధ్వర్యంలోని విశ్వ సంవాద కేంద్ర (VSK)-తెలంగాణ వెబ్ సైట్, లోకహితం జాగరణ పత్రిక, వీటి సోషల్ మీడియా ఖాతాలు, వాట్సాప్ చానెల్ ద్వారా జరుగుతున్న సమాచార సేవల గురించి స్థానిక పత్రికల సంపాదకులు, పాత్రికేయులకు వివరించారు.


Comments
Post a Comment