ఏసీబీకి చిక్కిన ‘అవినీతి’ రాంబాబు: రూ. 10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆర్‌ఐ
ఏసీబీకి చిక్కిన ‘అవినీతి’ రాంబాబు: రూ. 10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆర్‌ఐ
వరంగల్ (గూఢచారి ప్రతినిధి):
వరంగల్ జిల్లా దుగ్గొండి మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. పూర్వీకుల ఆస్తి మ్యుటేషన్ కోసం ఒక సామాన్యుడిని వేధించి, లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) గట్టికొప్పుల రాంబాబును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అసలేం జరిగిందంటే?
దుగ్గొండి మండలానికి చెందిన ఒక వ్యక్తి తన పూర్వీకుల ఆస్తికి సంబంధించి మ్యుటేషన్ ప్రక్రియ కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. అయితే, ఈ ఫైల్‌ను ముందుకు కదిలించడానికి, ఫీల్డ్ ఎంక్వయిరీ నిర్వహించి సానుకూల నివేదిక సమర్పించడానికి ఆర్‌ఐ రాంబాబు రూ. 10,000 లంచం డిమాండ్ చేశారు. అధికారి వేధింపులు భరించలేక సదరు బాధితుడు వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
మెరుపు దాడి.. పక్కా స్కెచ్
బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం పక్కా ప్రణాళికతో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిఘా పెట్టారు. బాధితుడి నుంచి రాంబాబు రూ. 10,000 లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ధృవీకరించారు.
న్యాయస్థానంలో హాజరు
విధుల్లో నిజాయితీ లోపించడం, అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు గాను రాంబాబును అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడిని వరంగల్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.
ప్రజలకు విజ్ఞప్తి:
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయండి. మీ వివరాలు అత్యంత రహస్యంగా ఉంచబడతాయి.
- గూఢచారి న్యూస్ నెట్‌వర్క్

Comments
Post a Comment