జీవో నెం.17 రద్దు చేయాలి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల డిమాండ్
*చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలి*
*కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా & నిరసన*
*కరీంనగర్, గూఢచారి:* రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 17ను వెంటనే రద్దు చేసి, చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ముందు అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి కొంకటి శేఖర్, అక్కనపల్లి శిరీష, మేకల రవీందర్, జన్ను స్వరూప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.17ను తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని విద్యా సంస్థలలో అవకాశం లేకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
*గుజరాత్ కంపెనీకి కట్టబెడుతున్నారు*
"ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందవలసిన వాటాను వాళ్లకు కేటాయించకుండా గుజరాత్ రాష్ట్రంలోని మఫ్ఫత్‌లాల్ కంపెనీకి లోపాయికారంగా టెండర్లను అప్పగిస్తూ మా జీవితాలతో చెలగాటమాడుతున్నారు" అని నాయకులు ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి జీవో నెం.17ను వెంటనే రద్దు పరచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు టెండర్లలో అవకాశం కల్పించాలని కోరారు.
*డిక్లరేషన్‌కు కట్టుబడాలి*
చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాయకులకు మాత్రమే టెండర్లు ఇవ్వాలని, గత ప్రభుత్వం మాదిరిగానే టెండర్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. స్థానికులకే కాంట్రాక్టులు ఇస్తే నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లు అవుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా ఇంచార్జిలు మేకల రవీందర్, అకినపల్లి శిరీష, జన్ను స్వరూపతో పాటు కరీంనగర్ స్వేరోస్ జిల్లా అధ్యక్షులు జెట్టపల్లి అనిల్, రాణా ప్రతాప్, CRO బడుగు నవీన్, మహమ్మద్ అజిం, కళ్ళేపల్లి అరవింద్, కళ్లేపల్లి తిరుపతి, రామగిరి తులసి, అకినపల్లి ప్రవీణ్, కళ్లేపల్లి రిషి, కొత్తూరి సతివక్, మారంపల్లి చరణ్ తదితరులు పాల్గొన్నారు.
*- గూఢచారి ప్రతినిధి*

Comments
Post a Comment