*రిటైర్డ్ డీజీపీ ఇంట్లో భార్య దారుణ హత్య - నేపాలి గ్యాంగ్ పనేనన్న సీపీ సజ్జనార్*
*రిటైర్డ్ డీజీపీ ఇంట్లో భార్య దారుణ హత్య - నేపాలి గ్యాంగ్ పనేనన్న సీపీ సజ్జనార్*
*హైదరాబాద్:* రిటైర్డ్ డీజీపీ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య తనూజ గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రాథమికంగా ఇది నేపాలి గ్యాంగ్ పనిగా అంచనా వేస్తున్నామని, కొన్ని కీలక క్లూస్ లభించాయని, వాటి ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు.
రాత్రి మాజీ డీజీపీ ఇంట్లో లేని సమయంలో దుండగులు వెనుక గేట్ నుంచి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండగా, పిల్లలు ఇద్దరూ పై అంతస్తులో ఉన్నారు. దుండగులు ఆమె చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి హత్య చేసి, అనంతరం వెనుక మార్గం గుండానే పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో పనిచేసే కల్పన అనే మహిళ బయటి వ్యక్తులతో కాంటాక్ట్ పెట్టుకొని ఈ నేరానికి సహకరించినట్లు సీపీ వెల్లడించారు.
మాజీ డీజీపీ తన తల్లి అనారోగ్యం కారణంగా ఇటీవల హైదరాబాద్ వచ్చారు. ఆమె మరణించడంతో మృతురాలు తనూజ అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఎంత బంగారం, నగదు చోరీకి గురైందనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణులు ఆధారాలు సేకరించారు.
నేపాలి పనివాళ్ల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, వారు సంవత్సరాలు పనిచేసినా నిఘా అవసరమని, ఇంట్లో ఎవరూ లేనప్పుడు వీరు నేరాలకు పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రజలు పానిక్ అవ్వద్దని, నిందితులను అతి త్వరలో ఖచ్చితంగా పట్టుకుంటామని, ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నామని ఆయన భరోసా ఇచ్చారు.
*- భూపతి రాజు*
*చీఫ్ క్రైమ్ రిపోర్టర్, "గూఢచారి"*

Comments
Post a Comment