*CURE ప్రాంతానికి కొత్త ఊపిరి: హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారుస్తాం - సీఎం రేవంత్*
*CURE ప్రాంతానికి కొత్త ఊపిరి: హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారుస్తాం - సీఎం రేవంత్*
*భవిష్యత్ తరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధ అభివృద్ధి*
*పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సీఎం వెల్లడి*
*హైదరాబాద్, గూఢచారి:* ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ (CURE) మొత్తంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శనివారం జరిగిన గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆధునీకరణ, నగరీకరణతో సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం సవివరంగా ఆవిష్కరించారు.
*ట్రాఫిక్ ఫ్రీ హైదరాబాద్ లక్ష్యం*
పెరుగుతున్న నగరీకరణ వల్ల సమీప భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సీఎం నొక్కి చెప్పారు. “హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. కీలకమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్‌ల వంటి మూడు విధానాల్లో రవాణా మార్గాలను కల్పిస్తున్నాం. పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు నగరంలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం” అని వివరించారు.
*CURE, PURE, RARE విధానంలో అభివృద్ధి*
తెలంగాణ రాష్ట్రాన్ని CURE, PURE, RARE విభాగాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించామని సీఎం తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్‌గా, ఓఆర్ఆర్ బయట నుంచి రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పెరి అర్బన్ రీజియన్ ఎకానమి (PURE) ప్రాంతాన్ని మాన్యుఫ్యాక్చర్ సెక్టార్‌గా, రీజనల్ రింగ్ రోడ్డు బయట ఉన్న రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (RARE) ప్రాంతంలో వ్యవసాయం, అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.
*మూసీ పునరుజ్జీవానికి కమిటీ కితాబు*
‘తెలంగాణ రైజింగ్ 2047’ మాస్టర్ ప్లాన్‌తో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని, కాలుష్య కోరల నుంచి హైదరాబాద్‌ను కాపాడటానికి మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ ఆర్టీసీలో ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నామని, కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేయించి ఈవీ వాహనాలుగా మార్చాలని నిర్ణయించామని వివరించారు.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు విప్లవాత్మకమని, హైదరాబాద్ జీవన స్థితిగతులను మెరుగుపరిచే ఇలాంటి ప్రాజెక్టు దేశంలోనే మొదటిదని స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు ఇతర సభ్యులు ప్రశంసించారు. ఈ ప్రాజెక్టు చేపట్టడంపై కమిటీ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించింది.
2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా తెలంగాణ ఎదగడానికి రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ - 2047’ విజన్ డాక్యుమెంట్‌ను స్టాండింగ్ కమిటీ సభ్యులకు అందజేశారు.
సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
*- గూఢచారి ప్రతినిధి*

Comments
Post a Comment