*మేరు జాతి మహిళా ఉద్యమకారులకు ఘన సన్మానం*
*రైతులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన భరతక్క, వనజక్కలకు సత్కారం*
*వరంగల్, తేదీ:* ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమాలకు పురిటిగడ్డగా నిలిచిన నేపథ్యంలో, రైతుల హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం తమ జీవితాలను పణంగా పెట్టి ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న మేరు జాతి మహిళా ఉద్యమకారులకు ఘనంగా సన్మానం జరిగింది. ప్రజా ఉద్యమ నేత అక్కరాజు హరిగోపాల్ అలియాస్ రామకృష్ణ సతీమణి సింగు సిరిష అలియాస్ భరతక్క, సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన పటేల్ సుధాకర్ రెడ్డి సతీమణి పటేల్ వనజ అలియాస్ కాపురి వనజక్కలను ఈ సందర్భంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మేరు కార్పొరేషన్ చైర్మన్ సంగా వెంకటరాజం, వైస్ చైర్మన్ మాడిశెట్టి లక్ష్మీనారాయణ, రాష్ట్ర మేరు సంఘం నాయకులు మునగాల రమేష్, మునగాల రాము, జిల్లా నాయకులు రాయబారు సంతోష్ తదితరులు పాల్గొని వారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా చైర్మన్ సంగా వెంకటరాజం మాట్లాడుతూ...
"మేరు జాతిలో పుట్టి రైతుల హక్కులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం తమ జీవితాలను, కుటుంబాలను సైతం పణంగా పెట్టి ప్రజా ఉద్యమాల్లో పోరాడిన భరతక్క, వనజక్కలు మేరు జాతి మహిళలకు ఆదర్శప్రాయులు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో, ఎందరో ఉద్యమకారుల త్యాగాల స్ఫూర్తితో మేరు జాతి మహిళలు సామాజిక, రాజకీయ రంగాల్లో ముందుకు రావాలి.
చిన్న జనాభా కలిగిన మేరు కులంలో పుట్టిన మహిళలు ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించడం మేరు జాతికి గర్వకారణం. వారి పోరాట స్ఫూర్తిని తెలంగాణలోని మేరు కులస్తులు, ముఖ్యంగా మేరు మహిళలు ఆదర్శంగా తీసుకుని రాజకీయంగా, సామాజికంగా ఎదగాలి.
భరతక్క, వనజక్కల ప్రజాసేవా స్ఫూర్తి రానున్న తరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. వారు ఇకముందు కూడా ప్రజాసేవలో కొనసాగుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, బీసీ వర్గాల సంక్షేమానికి, మేరు జాతి అభివృద్ధికి తమ సేవలను అందించాలి. రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో మరింతగా ఎదిగి రాజకీయ రంగంలో రాణించి చట్టసభల్లో అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తున్నాను.
ఈ సన్మానం కేవలం ఇద్దరు మహిళా ఉద్యమకారులకు చేసిన సత్కారం మాత్రమే కాదు, తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన మేరు జాతి మహిళల పోరాట స్ఫూర్తికి ఇచ్చిన గౌరవం" అని అన్నారు.
మేరు జాతి మహిళల పోరాట పటిమ, త్యాగం, ప్రజాసేవా స్ఫూర్తిని సమాజం గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.


Comments
Post a Comment