కొణిజేటి రోశయ్య ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త
కొణిజేటి రోశయ్య ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త
* ఘనంగా మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 93వ జయంతి వేడుకలు
* రవీంద్రభారతిలో చిత్రపటానికి నివాళులర్పించిన ప్రముఖులు
* ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
హైదరాబాద్ (గూఢచారి న్యూస్):
రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరతకు ప్రతీకగా నిలిచిన దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీపీసీసీ (TPCC) ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త పిలుపునిచ్చారు.
కొణిజేటి రోశయ్య గారి 93వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం మరియు కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన జయంతి సభకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులతో కలిసి ఉప్పల శ్రీనివాస్ గుప్త రోశయ్య గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
నేటి తరానికి రోశయ్య గారు ఆదర్శప్రాయుడు
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. ఎన్నో దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉంటూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం రోశయ్య గారు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. "అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల ప్రయోజనాలనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేసిన గొప్ప నాయకుడు రోశయ్య గారు. రాజకీయాల్లో విలువలు, ప్రజా ధనం పట్ల బాధ్యత, పరిపాలనలో పారదర్శకత వంటి అంశాల్లో ఆయన నేటి తరానికి ఆదర్శం" అని పేర్కొన్నారు.
ఆర్య వైశ్యులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్య వైశ్యుల అభ్యున్నతికి అన్ని విధాలా కృషి చేస్తోందని శ్రీనివాస్ గుప్త తెలిపారు. ఆర్య వైశ్యుల ఎన్నో ఏండ్ల ఆకాంక్ష అయిన "ఆర్య వైశ్య కార్పొరేషన్" ఏర్పాటు చేయడం, రోశయ్య గారి విగ్రహాన్ని ప్రతిష్టించడంతో పాటు.. అమీర్‌పేటలోని హాస్పిటల్‌కు రోశయ్య గారి పేరు పెడుతున్నట్లు ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
పెద్ద సంఖ్యలో హాజరైన ప్రముఖులు
ఈ ఘన నివాళి కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, టూరిజం అండ్ కల్చరల్ మేనేజింగ్ డైరెక్టర్ వాణి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త, ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్పర్సన్ కల్వ సుజాత, అమరవాది లక్ష్మి నారాయణ పాల్గొన్నారు. అలాగే రోశయ్య గారి కుటుంబ సభ్యులు, పెద్ద కుమారుడు శివ సుబ్బారావు, మనమడు హర్ష మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రోశయ్య గారికి నివాళులర్పించారు.

Comments
Post a Comment