డిజిటల్ అరెస్టు కేసులో సీబీఐ సోదాలు; అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్‌తో సహా ముగ్గురి అరెస్టు
డిజిటల్ అరెస్టు కేసులో సీబీఐ సోదాలు; అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్‌తో సహా ముగ్గురి అరెస్టు
తేదీ: 18.04.2026
'డిజిటల్ అరెస్ట్' కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
గౌరవనీయ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. బాధితురాలైన ఒక సీనియర్ సిటిజన్‌ను 'డిజిటల్ అరెస్ట్' చేస్తామని బెదిరించి, ఆమె నుండి రూ.1.6 కోట్లకు పైగా మొత్తాన్ని బదిలీ చేయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయని అధికారులు ఒక ప్రకటన లో వెల్లడించారు.
సైబర్ మోసం ద్వారా వచ్చిన సొమ్మును స్వీకరించడాన్ని సులభతరం చేసేందుకు, మోసపూరితంగా కాజేసిన నిధులను ఒక కంపెనీ పేరుతో మోసపూరితంగా తెరిచిన బ్యాంకు ఖాతాకు మళ్లించినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు.
దర్యాప్తు కొనసాగింపులో భాగంగా, మోసపూరితంగా బ్యాంకు ఖాతా తెరవడంలో సహకరించిన ఆరోపణలపై ఇండస్‌ఇండ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌ను అరెస్టు చేశారు. అరెస్టు అయిన మిగతా ఇద్దరు నిందితులు మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ఏర్పాటు చేయడంలో, అలాగే బాధితుడి నుండి నేర సొమ్మును పలు ఖాతాల ద్వారా మళ్లించి, బదిలీ చేయడంలో చురుకుగా పాల్గొన్నారని అధికారులు తెలిపారు.
నిందితుడికి సంబంధించిన ప్రాంగణంలో జరిపిన సోదాల సందర్భంగా, పలు నేరారోపణ పత్రాలు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలకు ప్రాప్యత కల్పించడం లేదా వాటిని దుర్వినియోగం చేయడం ద్వారా సైబర్ నేర కార్యకలాపాలకు సహకరించే వ్యక్తులు, సంస్థలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీబీఐ పునరుద్ఘాటిo చింది.
ఇటువంటి మోసపూరిత పథకాల పట్ల, ముఖ్యంగా 'డిజిటల్ అరెస్ట్' వంటి కల్పిత భావనల ద్వారా బెదిరింపులకు పాల్పడే వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటువంటి అరెస్టుకు చట్టపరంగా ఎలాంటి నిబంధన లేదని సీబీఐ స్పష్టం చేసింది. పౌరులు భయపడవద్దని, అటువంటి మోసపూరిత సమాచారానికి లొంగిపోవద్దని విజ్ఞప్తి చేసారు.
చట్ట అమలు లేదా నియంత్రణ అధికారుల పేరుతో చేసే నకిలీ కాల్స్, అలాగే మోసపూరిత పెట్టుబడి పథకాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతోందని. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాన్ని వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా లేదా సమీపంలోని చట్ట అమలు సంస్థకు నివేదించాలనీ కోరారు.

Comments
Post a Comment