*బండ్లగూడ RTO ఆఫీస్‌లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.. అక్రమాలు బట్టబయలు*
*బండ్లగూడ RTO ఆఫీస్‌లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.. అక్రమాలు బట్టబయలు*
*హైదరాబాద్, సెప్టెంబర్ 22:* బండ్లగూడలోని సౌత్ జోన్ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO)లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు చేపట్టిన ఈ సర్‌ప్రైజ్ చెక్‌లో విస్తుపోయే అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
కార్యాలయంలోని సిబ్బంది సెల్‌ఫోన్లను పరిశీలించగా అనుమానాస్పద UPI లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అంతేకాకుండా కార్యాలయం లోపల అనధికారికంగా ఏజెంట్లు సంచరిస్తూ దరఖాస్తులతో కనిపించడం ఏసీబీ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏజెంట్ల వద్ద నుండి ఏకంగా రూ.24,760 నగదును స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు కొందరు అధికారులు ఏజెంట్ల ద్వారా వచ్చే దరఖాస్తులను వేగంగా క్లియర్ చేయడానికి వాటిపై ప్రత్యేక సంకేతాలు, పేర్లు రాస్తున్నట్లు తేలింది. ఇలా చేస్తున్న వారిలో AOలుగా పనిచేస్తున్న బి.సునీత, ఎన్.హేమంత్ కుమార్, సీనియర్ అసిస్టెంట్లు మహ్మద్ ఇమ్రాన్, కె.సాయి కుమార్, జూనియర్ అసిస్టెంట్లు కె.బాబూజీ, టి.సాయికాంత్, అలాగే MA లతీఫ్ ఖాన్ ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. అదనంగా సీనియర్ అసిస్టెంట్ సాయి కుమార్, జూనియర్ అసిస్టెంట్ సాయికాంత్ వద్ద నుండి 33 రవాణా దరఖాస్తులు మాయమైనట్లు కూడా బయటపడింది.
ఇదే క్రమంలో కొందరు సిబ్బంది ఏళ్ల తరబడి ఇదే కార్యాలయంలో తిష్ట వేసినట్లు తనిఖీల్లో వెల్లడైంది. ముఖ్యంగా MA లతీఫ్ అనే ఉద్యోగి చిన్నపాటి విరామాలతో దాదాపు 20 ఏళ్లుగా ఇదే సౌత్ జోన్ కార్యాలయంలోనే కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ తనిఖీలపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నారు.

Comments
Post a Comment