*కమీషన్ ఇవ్వకపోతే బిల్లులు ఆపేస్తాం.. రూ.39 లక్షలు వసూలు చేసిన PMKSY అధికారులు ఇద్దరు అరెస్ట్*


 *కమీషన్ ఇవ్వకపోతే బిల్లులు ఆపేస్తాం.. రూ.39 లక్షలు వసూలు చేసిన PMKSY అధికారులు ఇద్దరు అరెస్ట్*


*జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 22:* భగీరథీపేట్ ప్రాజెక్టులో కాంట్రాక్టర్ నుంచి బిల్లుల పేరుతో భారీగా కమీషన్ వసూలు చేస్తున్న ఇద్దరు అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఏసీబీ ప్రెస్ నోట్ నెం.160 ప్రకారం నిందితులను ప్రాజెక్ట్ ఆఫీసర్ సతీష్ రెడ్డి, టెక్నికల్ ఆఫీసర్ రాజుగా గుర్తించారు. ఇద్దరూ PMKSY 2.0, భగీరథీపేట్ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు.


PMKSY 2.0 పథకం కింద చేపట్టిన పనుల బిల్లులు క్లియర్ చేయడానికి, అలాగే కొత్త పనులు కేటాయించడానికి ఈ ఇద్దరు అధికారులు 10 శాతం నుంచి 25 శాతం వరకు కమీషన్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే పెండింగ్ బిల్లులు ప్రాసెస్ చేయబోమని, కొత్త పనులు ఇవ్వబోమని బెదిరింపులకు కూడా దిగారు.


ఫిర్యాదు అందిన తర్వాత విచారణ చేపట్టిన ఏసీబీకి సంచలన విషయాలు తెలిశాయి. నిందితులు సూచించిన వివిధ బ్యాంక్ ఖాతాలు, యూపీఐ ఖాతాలకు కాంట్రాక్టర్ ఏకంగా రూ.39 లక్షల 17 వేలు బదిలీ చేసినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి బ్యాంక్ స్టేట్ మెంట్లు, వాట్సాప్ చాట్ రికార్డులను కూడా ఫిర్యాదుదారుడు ఏసీబీకి అందజేశారు. ఇక ఏడో బిల్లుకు సంబంధించిన కొలతలు నమోదు చేసి బిల్లు క్లియర్ చేయడానికి ప్రాజెక్ట్ ఆఫీసర్ సతీష్ రెడ్డి అదనంగా మరో 25 శాతం డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది.


ఆధారాలు పక్కాగా ఉండటంతో వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను బుధవారం అరెస్ట్ చేసి వరంగల్ లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హాజరుపరచారు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు