*వాయు కాలుష్యానికి చెక్.. తెలంగాణలో PM10 స్థాయిలు తగ్గుముఖం - నల్గొండలో 59 నుండి 71 వరకు పెరుగుదల - సెక్రటేరియట్ లో ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ సమీక్ష
*వాయు కాలుష్యానికి చెక్.. తెలంగాణలో PM10 స్థాయిలు తగ్గుముఖం - నల్గొండలో 59 నుండి 71 వరకు పెరుగుదల - సెక్రటేరియట్ లో ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ సమీక్ష*
*హైదరాబాద్, అక్టోబర్ 07:* తెలంగాణలో వాయు నాణ్యత మెరుగుదలకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ పేర్కొంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు శాస్త్రీయ పర్యవేక్షణ, సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించింది.
ఈరోజు సెక్రటేరియట్ లో అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిటీ ఛైర్మన్ *అహ్మద్ నదీమ్*, టీజీపీసీబీ మెంబర్ సెక్రటరీ, మెంబర్ కన్వీనర్ *రవి* ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. జీహెచ్ఎంసీ, ట్రాన్స్ పోర్ట్, ట్రాఫిక్, వ్యవసాయ, పౌర సరఫరాల, పరిశ్రమల శాఖల అధికారులు పాల్గొన్నారు.
*సమావేశంలో వెల్లడైన కీలక అంశాలు:*
*PM10 స్థాయిల్లో తగ్గుదల:* 2019-20 నుంచి 2025-26 మధ్య హైదరాబాద్ లో PM10 సగటు 86 నుంచి 80 µg/m³కు, సంగారెడ్డిలో 87 నుంచి 78 µg/m³కు తగ్గింది. నల్గొండలో మాత్రం 59 నుంచి 71కు పెరిగింది. ప్రస్తుత AQI సంతృప్తికరం నుంచి మోస్తరు స్థాయిలో ఉంది.
*పర్యవేక్షణ వ్యవస్థ బలోపేతం:* CURE ప్రాంతంలో మరో 13 నిరంతర వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు (CAAQMS) ఏర్పాటు చేస్తున్నారు. రియల్ టైమ్ డేటా కోసం ఎయిర్ క్వాలిటీ డ్యాష్ బోర్డు, SMS అలర్ట్ వ్యవస్థ సిద్ధం చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో పనిచేసే 8 Low Cost Sensors ను బొల్లారం, జీడిమెట్లలో ఏర్పాటు చేశారు.
*రోడ్ డస్ట్ కు చెక్:* రోడ్ల ఎండ్-టు-ఎండ్ పేవింగ్, మెకానికల్ స్వీపింగ్, గ్రీన్ కవర్, మియావాకీ, మినీ ఫారెస్టుల పెంపుపై దృష్టి పెట్టారు.
*వాహన కాలుష్య నియంత్రణ:* 516 PUC కేంద్రాలను కేంద్ర సర్వర్ కు అనుసంధానం చేశారు. ఇప్పటివరకు 36.14 లక్షల పరీక్షలు చేశారు. గడువు ముగిసిన వాహనాలకు ANPR కెమెరాలతో ఆటో చలాన్ విధానం తీసుకొస్తున్నారు. GHMC పరిధిలో 310 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. PM E-Drive కింద మరిన్ని బస్సులు రానున్నాయి.
*కాలుష్య మూలాల గుర్తింపు:* నల్గొండ, సంగారెడ్డిలో IIT బాంబేతో Source Apportionment Study కొనసాగుతోంది. UNEP తో కలిసి రాష్ట్ర స్థాయి ఉద్గారాల లెక్కింపు (Emission Inventory) చేస్తున్నారు. డీజిల్ జనరేటర్లకు RECD పరికరాలు, వ్యవసాయ వ్యర్థాలను బ్రికెట్లుగా మార్చడం వంటి చర్యలు చేపడుతున్నారు.
*నిధుల వినియోగం:* NCAP కింద హైదరాబాద్ లో 90.27%, నల్గొండలో 82.5%, పటాన్ చెరులో 100%, సంగారెడ్డిలో 76.43% నిధులు వినియోగించారు. 2026-27కి నల్గొండకు రూ.4.83 కోట్లు, సంగారెడ్డికి రూ.2.42 కోట్లు కేటాయించారు.
*నల్గొండకు జాతీయ గుర్తింపు:* స్వచ్ఛ వాయు సర్వేక్షణలో నల్గొండలోని 16వ వార్డు జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించి రూ.20 లక్షల బహుమతి పొందిందని ఛైర్మన్ అహ్మద్ నదీమ్, మెంబర్ కన్వీనర్ రవి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ 215, గన్ ఫౌండ్రీ 154, సంగారెడ్డి 31వ వార్డులు రాష్ట్రంలో ఉత్తమంగా నిలిచాయి.

Comments
Post a Comment