మా ఉద్యమంలో సమాజం కలిసి రావాలి.- టి. సంతోష్ చక్రవర్తి, జిల్లా అధ్యక్షులు, టిడబ్ల్యూజేఎఫ్
*మా ఉద్యమంలో సమాజం కలిసి రావాలి.- టి. సంతోష్ చక్రవర్తి, జిల్లా అధ్యక్షులు, టిడబ్ల్యూజేఎఫ్
*జర్నలిస్టుల నివాస హక్కు కోసం ఖమ్మంలో టిడబ్ల్యుజెఎఫ్ మోటార్ సైకిల్ ర్యాలీ..*
*జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి బర్త్ డే సందర్భంగా అన్నం సేవ ఫౌండేషన్ లో పండ్లు పంపిణీ.*
ఖమ్మం | జనవరి 2
అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టుల ఇండ్ల సాధన లక్ష్యంగా సమాజం జర్నలిస్టులకు తోడుగా కలిసి రావాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్– హెచ్ 2843) ఖమ్మం జిల్లా అధ్యక్షులు టి. సంతోష్ చక్రవర్తి పిలుపు నిచ్చారు. శుక్రవారం టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ చక్రవర్తి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి, అన్నం సేవా ఫౌండేషన్ లో అనాధ, అభాగ్యులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సంతోష్ చక్రవర్తి మాట్లాడుతూ సమాజం జర్నలిస్టులకు తోడుగా నిలబడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేవలం సానుభూతిగా మాత్రమే కాదని, అది సమాజ స్వీయరక్షణ కోసం అని అన్నారు. ప్రజాస్వామ్యంలో సత్యాన్ని వెలికి తీయడం, అన్యాయాన్ని ప్రశ్నించడం, పాలకులకు బాధ్యతను గుర్తుచేయడమే జర్నలిస్టుల ప్రధాన కర్తవ్యమని సంతోష్ చక్రవర్తి ఉద్ఘాటించారు.
అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టులు ఉండటానికి గూడు లేక, అద్దె ఇళ్ళలో సతమతమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ భవిష్యత్తుపై అనిశ్చితితో బతికితే సమాజానికి న్యాయం చేసే శక్తి క్రమంగా బలహీన మవుతుందన్నారు.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పోరాటం వ్యక్తిగత అంశం కోసం సాగుతున్న ఉద్యమం కాదని, సమాజానికి నిజమైన స్వరం నిరంతరం కొనసాగేందుకు సాగే న్యాయపోరాటమని సంతోష్ చక్రవర్తి పేర్కొన్నారు. అందుకే ఈ పోరాటానికి సమాజం మొత్తం మద్దతుగా నిలబడి తమ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాలని ఆయన కోరారు. ప్రజలకు– ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించే జర్నలిస్టుల చిరకాల కోరిక నివాసయోగ్యమైన ఇంటి స్థలం మాత్రమేనని, ఆ హక్కు సాధించే వరకు వెనుకడుగు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో అర్హులైన 325కి పైగా జర్నలిస్టు కుటుంబాలకు గూడు దక్కే వరకూ ప్రభుత్వాన్ని నిత్యం ప్రశ్నిస్తూ, రాజీలేని న్యాయపోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఇండ్ల స్టలాల సాధనకోసం కార్యాచరణ ప్రారంభిస్తున్నట్లు సంతోష్ చక్రవర్తి తెలిపారు.
జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ పేరుతో కేటాయించిన 23.02 ఎకరాల భూమిని ఎలాంటి స్వార్థం, పక్షపాతం లేకుండా జర్నలిస్టులకు అప్పగించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అర్హులైన 325 మందికి పైగా జర్నలిస్టులకు హామీ, జీవో మేరకు 200 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించడం ప్రభుత్వ బాధ్యతేనని స్పష్టం చేశారు. ఇది వ్యక్తిగత స్వార్థం కోసం చేసే పోరాటం కాదని, జర్నలిస్టు కుటుంబాల భవిష్యత్తు కోసం సాగే సమిష్టి న్యాయ ఉద్యమమని ఆయన పునరుద్ఘాటించారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మేధావులు, ప్రజల మద్దతుతో ఈ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని ప్రకటించారు. కొంతమంది దూరంగా ఉన్నా, అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టు నిస్సంకోచంగా ఈ న్యాయపోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల ఐక్యతే మా బలమని, న్యాయపోరాటమే తన లక్ష్యమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, కోశాధికారి అర్వపల్లి నగేష్, ఉపాధ్యక్షులు అంతోటి శ్రీనివాస్, లీగల్ అడ్వైజర్ పసుపులేటి శ్రీనివాసరావు, అమరబోయిన ఉపేందర్, కాసోజు శ్రీధర్, సుధాగాని కరుణాకర్, కప్పల మధు గౌడ్, కందరపోయిన నాగకృష్ణ, వంగ పుంగమ గౌడ్, కొండల్, ఎలుగోటి వెంకట్, కరాటే వేణు, నాయిని స్వాతి, రాంబాబు, తుమ్మలపల్లి శ్రీనివాస్, షేక్ సోందుమియా, మల్లెల శిల్ప, కుంభం రవికుమార్, రమేష్, గంటేల కుమార్, మందాడపు మనోహర్, సురేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.



Comments
Post a Comment