వాయు & వాహన కాలుష్యంపై అవగాహన కొరకు టీజీపీసీబీని సందర్శించిన నార్సింగి గీతాంజలి వేదిక 9వ తరగతి విద్యార్థులు
వాయు & వాహన కాలుష్యంపై అవగాహన కొరకు టీజీపీసీబీని సందర్శించిన నార్సింగి గీతాంజలి వేదిక 9వ తరగతి విద్యార్థులు
హైదరాబాద్:
నార్సింగి లోని గీతాంజలి వేదిక 9వ తరగతి విద్యార్థులు, పర్యావరణ కాలుష్యం, వాయు కాలుష్యo, మరియు వాహన కాలుష్యం నియంత్రణ పై అవగాహన కల్పించేందుకు విద్యా పర్యటనలో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి టీజీపీసీబీని ను సందర్శించారు.
ఈ సందర్భంగా టీజీపీసీబీ సీనియర్ సోషల్ సైంటిస్ట్ డా. డబ్ల్యూ.జి. ప్రసన్న కుమార్ వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలైన నైట్రోజన్ ఆక్సైడ్లు, కార్బన్ ఉద్గారాలు, బెంజీన్, ఓజోన్ వంటి కాలుష్య కారకాలు ఊపిరితిత్తుల వ్యాధులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని వివరించారు. కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన నివారణ చర్యలు, పరిష్కార మార్గాలను కూడా వివరించారు. వాయు కాలుష్యానికి దారితీసే నాలుగు ముఖ్య కారణాలుగా వాహనాలను అవసరం లేకుండా ఆన్‌లో ఉంచడం, రోడ్ల దుస్థితి, ఇంజిన్ నాణ్యత లోపాలు మరియు సరైన నిర్వహణ లేకపోవడం, కల్తీ పెట్రోల్ వినియోగం గురించి విద్యార్థులకు తెలియజేశారు.
టీజీపీసీబీ పర్యావరణ శాస్త్రవేత్త జె. సుమతి విద్యార్థులకు చెత్త పారవేత వల్ల కలిగే నష్టాలను వివరించారు. ముఖ్యంగా బస్సుల నుండి చాక్లెట్ కవర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్లపై పడేయడం పర్యావరణానికి హానికరమని, వాటిని తప్పనిసరిగా డస్ట్‌బిన్‌లలో వేయాలని సూచించారు.
స్విచ్‌ఈకో వ్యవస్థాపకుడు అక్షయ్ వాయు కాలుష్యంపై ప్రజెంటేషన్ ఇచ్చి, కాలుష్యాన్ని తగ్గించే సుస్థిర మొబిలిటీ మార్గాలను వివరించారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు , హైడ్రోజన్ ఇంధనం, సీఎన్‌జీ మరియు ఇతర పర్యావరణ హిత ఇంధనాలు, సాధారణ డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలకు ఉత్తమ ప్రత్యామ్నాయాలని పేర్కొన్నారు.
టీజీపీసీబీ ఇంటర్న్స్ కె. స్వాతి మరియు టి. మౌనిక వాయు కాలుష్య అవగాహన మరియు పర్యావరణ బాధ్యతపై ప్రజెంటేషన్లు ఇచ్చారు.
ఈ విద్యా పర్యటనలో గీతాంజలి వేదిక ఉపాధ్యాయులు వి. కల్పన, విజయ శాంతి, ప్రసాద్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల బృందం శ్రీ ప్రసన్న కుమార్ గారికి బహుమతి అందించి సన్మానించారు.


Comments
Post a Comment