*ఐక్య పోరాటమే ఇండ్ల స్థలాల సాధనకు మార్గం*


 

*ఐక్య పోరాటమే ఇండ్ల స్థలాల సాధనకు మార్గం*


- పాత్రికేయుల హక్కుల కోసం పోరాటం 


– సీనియర్ జర్నలిస్ట్ టి.ఎస్. చక్రవర్తి


ఖమ్మం, ఏప్రిల్ 03


అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను ఇకపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయరాదని, ఇది కేవలం కొందరి వ్యక్తిగత అవసరం కాదని, మొత్తం పాత్రికేయ వర్గ భద్రత, జీవన హక్కులకు సంబంధించిన కీలక అంశమని టిడబ్ల్యూజెఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ టి.ఎస్. చక్రవర్తి స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిరోజూ వెలుగులోకి తీసుకొచ్చే పాత్రికేయులకే కనీస గృహ భద్రత లేకపోవడం దురదృష్టకరమని, 'కలం పట్టే చేతులకు కనీస స్థలం కూడా దక్కకపోతే అది వ్యవస్థ వైఫల్యానికి ప్రత్యక్ష నిదర్శనం' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశం అనేది ఒక్కో వ్యక్తి కోరిక కాదని, ఇది వృత్తి గౌరవాన్ని కాపాడే హక్కు పోరాటమని ఆయన పేర్కొన్నారు. గతంలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధన కోసం నిర్వహించిన పలు ఆందోళనలు, వినతిపత్రాల కార్యక్రమాలు, దీక్షలు, నిరసనల్లో తాను ప్రత్యక్షంగా పాల్గొన్నానని గుర్తు చేశారు. ఇటీవల నిర్వహించిన రిలే నిరాహార దీక్షల్లో ఒక రోజు పాల్గొని సంఘీభావం తెలిపినట్లు తెలిపారు. ఈ సమస్యపై గతంలో ధర్నాలు, బైక్ ర్యాలీ లు, అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రాలు అందజేయడం, పలువురు మంత్రులను కలిసి సమస్యను వివరించడం, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని వెల్లడించారు.


అదేవిధంగా జిల్లా కలెక్టర్ నుంచి మీడియా అకాడమీ చైర్మన్ వరకు, న్యాయవర్గ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ స్థాయిల నాయకుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేసినట్లు తెలిపారు. 'పదవికి రాజీనామా చేశాను, పోరాటానికి కాదు' అని స్పష్టం చేసిన టి.ఎస్. చక్రవర్తి, జర్నలిస్టుల హక్కుల సాధన కోసం తన పోరాటం చివరి వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. పలువురు సీనియర్ జర్నలిస్టులు, మేధావులు, ప్రజాసంఘాలు, ఉద్యమకారులు, విద్యార్థి సంఘాలు కూడా ఈ డిమాండ్‌కు మద్దతుగా ముందుకు వస్తున్నాయని, ఇది క్రమంగా సామాజిక న్యాయ పోరాటంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు.


ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరూ వ్యక్తిగత భేదాభిప్రాయాలు, యూనియన్ వేర్పాట్లు, చిన్నచిన్న విభేదాలు అన్నీ పక్కనబెట్టి 'ఇంటి స్థలం – జీవన హక్కు' అనే ఒకే నినాదంతో ఐక్యంగా ముందుకు రావాలని టి.ఎస్. చక్రవర్తి పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యను జర్నలిస్టులే ఒంటరిగా మోసే రోజులు పోయాయని, ఇప్పుడు సమాజం మొత్తం ఈ న్యాయమైన డిమాండ్‌కు అండగా నిలవాల్సిన సమయం వచ్చిందన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇండ్ల స్థలం సాధించే వరకు ఈ ఉద్యమం ఆగదని, అవసరమైతే జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి విస్తరించేలా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాత్రికేయుల గౌరవం, జీవన భద్రత కోసం సాగుతున్న ఈ పోరాటంలో అందరూ కలిసిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్