*కీసర ఎస్ఐ ఏసీబీ వలలో.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత*
*కీసర ఎస్ఐ ఏసీబీ వలలో.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత*
*హైదరాబాద్, నవంబర్ 9:* మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఏసీబీ వలలో చిక్కాడు.
కీసర పీఎస్‌లో ఎస్ఐగా పనిచేస్తున్న *కొండారెడ్డి శ్రీనివాస్* ను సిటీ రేంజ్ - 2 ఏసీబీ అధికారులు రూ.2,00,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
*చార్జిషీట్ కోసం రూ.2 లక్షల డిమాండ్:*
ఫిర్యాదుదారుడు కీసర పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్లు 180/2026 మరియు 738/2026 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసుల్లో విచారణ త్వరగా పూర్తి చేసి, వెంటనే చార్జిషీట్ దాఖలు చేసేందుకు సాయం చేస్తానని చెప్పి ఎస్ఐ రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు.
ఫిర్యాదు మేరకు వలపన్నిన ఏసీబీ అధికారులు ఎస్ఐ నుండి రూ.2 లక్షల లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అధికార పదవిని దుర్వినియోగం చేసి, అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ తెలిపింది.
నిందితుడిని అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు (I Addl. Spl. Judge for SPE & ACB Cases) ముందు హాజరుపరచనున్నారు. కేసు విచారణలో ఉంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాలతో గోప్యంగా ఉంచారు.
*లంచం అడిగితే 1064కు కాల్ చేయండి:* ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు, వాట్సాప్ 9440446106కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ కోరింది.

Comments
Post a Comment