# ఎంగిలి విస్తర్లలోనూ పర్యావరణ పరిరక్షణకు మార్గం వెతుకుతున్న మాజీ బ్యాంకు మేనేజర్! ## ప్లాస్టిక్ కోటింగ్‌ను వేరు చేసి రీసైక్లింగ్‌కు పంపుతున్న సురేష్ గుప్తా సేవలు ఆదర్శనీయం
# ఎంగిలి విస్తర్లలోనూ పర్యావరణ పరిరక్షణకు మార్గం వెతుకుతున్న మాజీ బ్యాంకు మేనేజర్! ## ప్లాస్టిక్ కోటింగ్‌ను వేరు చేసి రీసైక్లింగ్‌కు పంపుతున్న సురేష్ గుప్తా సేవలు ఆదర్శనీయం
**నల్గొండ:** పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రసంగాలకే పరిమితం కాకూడదు. ఆచరణలో చూపినప్పుడే దానికి నిజమైన అర్థం ఉంటుంది. ఈ విషయాన్ని తన సేవా కార్యక్రమాలతో నిరూపిస్తున్నారు నల్గొండ జిల్లాకు చెందిన మాజీ బ్యాంకు మేనేజర్ సురేష్ గుప్తా.
సాధారణంగా వివాహాలు, శుభకార్యాలు, ఇతర వేడుకల్లో భోజనాల అనంతరం ప్లాస్టిక్ పూతతో కూడిన విస్తర్లు, ప్లేట్లు పెద్ద మొత్తంలో చెత్తగా మారుతుంటాయి. వీటిని ఇతర వ్యర్థాలతో కలిపి పారవేయడం వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని గుర్తించిన సురేష్ గుప్తా, ఈ సమస్యకు తనవంతుగా పరిష్కారం చూపుతున్నారు.
ఎక్కడ ఫంక్షన్ జరిగినా, ఎక్కడ సామూహిక భోజనాలు ఏర్పాటు చేసినా అక్కడికి చేరుకుంటారు. భోజనాలు పూర్తయిన తర్వాత పారవేసిన విస్తర్లను సేకరించి, వాటిపై ఉండే ప్లాస్టిక్ ఫిల్మ్‌ను విస్తరి అట్ట నుంచి విడదీస్తారు. వేరు చేసిన ప్లాస్టిక్‌ను సురక్షితంగా పారవేసే ప్రయత్నం చేస్తూ, మిగిలిన విస్తరి అట్టలను రీసైక్లింగ్‌కు పంపిస్తున్నారు.
గతంలో బ్యాంకు మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి, తనకు సంబంధం లేని కార్యక్రమాలకు వెళ్లి, ఇతరులు భోజనం చేసిన తర్వాత పారవేసిన విస్తర్లను స్వయంగా సేకరించి పర్యావరణ హితం కోసం శ్రమించడం నిజంగా అభినందనీయం. హోదా, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా సమాజం పట్ల బాధ్యతతో పనిచేయవచ్చని ఆయన నిరూపిస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర మహాసభల సందర్భంగా కూడా సురేష్ గుప్తా భోజనశాల వద్దకు చేరుకుని తన సేవా కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఈ విషయాన్ని అక్కడి నిర్వాహకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయన సేవలను అభినందించారు.
### ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహం అవసరం
సురేష్ గుప్తా చేస్తున్న పర్యావరణ సేవలను ప్రభుత్వం తప్పనిసరిగా గుర్తించి తగిన ప్రోత్సాహం అందించాలి. ఆయన అనుభవాన్ని, సేవా స్ఫూర్తిని ఇతర ప్రాంతాల ప్రజలకు పరిచయం చేసి, పాఠశాలలు, కళాశాలలు, స్వచ్ఛంద సంస్థలు, శుభకార్యాల నిర్వాహకులకు మార్గదర్శనం చేసేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. ఆయన అనుసరిస్తున్న విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేయడానికి అవసరమైన సహకారం అందించాలి.
ఒక్క సురేష్ గుప్తాతోనే ఈ సేవ ఆగిపోకుండా, ఆయన స్ఫూర్తితో మరెందరో ముందుకు వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఆయన సేవలను గుర్తించి తగిన పురస్కారం లేదా ప్రశంసాపత్రంతో సత్కరించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో ఆయన అనుభవాన్ని వినియోగించుకోవాలి.
పర్యావరణ పరిరక్షణకు పెద్ద పెద్ద ఉపన్యాసాలు అవసరం లేదు.. మన చేతులతో చేసే చిన్న చిన్న పనులే సమాజంలో పెద్ద మార్పుకు నాంది పలుకుతాయి. వ్యక్తిగతంగా చేస్తున్న ఒకరి సేవ ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రజా ఉద్యమంగా మారితే పర్యావరణ పరిరక్షణలో గొప్ప మార్పు సాధ్యమవుతుంది.
**సురేష్ గుప్తా సేవలకు హ్యాట్సాఫ్! ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాల్సిన ఇలాంటి సేవా మూర్తులు సమాజానికి ఎంతో అవసరం. ఆయన అడుగులు మరెందరికో స్ఫూర్తి కావాలి.**

Comments
Post a Comment