# హైదరాబాద్‌లో రేపటి నుంచి 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి#
# హైదరాబాద్‌లో రేపటి నుంచి 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి#
## నాలుగు రోజుల పాటు జాతీయ స్థాయి సదస్సు.. 3,500 మంది ప్రతినిధులు, 400 ఎగ్జిబిషన్ స్టాళ్లు
### తెలంగాణ అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం.. రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
**హైదరాబాద్:** తెలంగాణలో రోడ్లు, వంతెనల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. నవంబర్ 19 నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్ హైటెక్స్‌లో జరగనున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (IRC) సమావేశాల వివరాలను బుధవారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన వెల్లడించారు.
**నితిన్ గడ్కరీ అంగీకారంతో తెలంగాణకు అవకాశం**
85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సమావేశాలను ఈ ఏడాది తెలంగాణలో నిర్వహించాలని తాను వ్యక్తిగతంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి కోరానని, అందుకు ఆయన అంగీకరించారని కోమటిరెడ్డి తెలిపారు. ఇందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తన తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గురువారం ఉదయం 11.30 గంటలకు నితిన్ గడ్కరీ సమావేశాలను ప్రారంభిస్తారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు.
ఈ సమావేశాలకు వివిధ రాష్ట్రాల నుంచి రోడ్లు, హైవేల రంగానికి చెందిన నిపుణులు, ఇంజినీర్లు, అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు కలిపి సుమారు 3,500 మంది హాజరవుతారని తెలిపారు.
**హైదరాబాద్‌లో ఏడోసారి ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్**
1934లో ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ ఏర్పాటైందని, అప్పటి నుంచి దేశంలో రోడ్లు, వంతెనల అభివృద్ధిలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి చెప్పారు. హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఆరుసార్లు IRC సమావేశాలు జరిగాయని, ప్రస్తుతం ఏడోసారి జరుగుతున్నాయని వివరించారు.
1938లో దక్కన్ సంస్థానం కాలంలో నాలుగో IRC సమావేశం తొలిసారిగా హైదరాబాద్‌లో జరిగిందని, స్వాతంత్ర్యం అనంతరం 1959లో 23వ సమావేశం, 1976లో 36వ సమావేశం, 1987లో 47వ సమావేశం, 1999లో 59వ సమావేశం నిర్వహించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో 77వ సమావేశం జరిగిందని, ఇప్పుడు 85వ సమావేశానికి హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోందని పేర్కొన్నారు.
**ఏఐ, డిజిటల్ టెక్నాలజీ, గ్రీన్ రోడ్లపై చర్చలు**
ఈసారి సమావేశాల్లో పర్యావరణానికి అనుకూలమైన రోడ్ల నిర్మాణం, వాతావరణ మార్పులను తట్టుకునే మౌలిక సదుపాయాలు, డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక రవాణా వ్యవస్థలపై ప్యానల్ చర్చలు జరుగుతాయని కోమటిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ సురక్షితంగా నడిచే హక్కు కల్పించే 'రైట్ టు వాక్' అంశంపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు చెప్పారు.
ఈ సదస్సులో సుమారు 400 ఎగ్జిబిషన్ స్టాళ్లు, 19 టెక్నికల్ సెషన్లు ఉంటాయని, కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్రాలు, నిర్మాణ పద్ధతులను తెలుసుకునే అవకాశం కలుగుతుందని వివరించారు. తెలంగాణలో జరుగుతున్న రోడ్లు, బ్రిడ్జిలు, ఇతర మౌలిక సదుపాయాల పనులను తెలంగాణ పెవిలియన్ ద్వారా ప్రతినిధులకు చూపిస్తామని తెలిపారు.
**రోడ్లు, బ్రిడ్జిలకు రూ.5,677 కోట్ల కేటాయింపులు**
తెలంగాణలో రోడ్ల వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. 2026–27 బడ్జెట్లో రోడ్లు, బ్రిడ్జిల కోసం రూ.5,677 కోట్లు కేటాయించామని వెల్లడించారు. రాష్ట్రంలో పెరుగుతున్న పరిశ్రమలు, వ్యాపారాలు, పట్టణాలకు అనుగుణంగా మెరుగైన రోడ్లు, కనెక్టివిటీ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్–విజయవాడ హైవే విస్తరణ, హైదరాబాద్ ఎలివేటెడ్ కారిడార్ వంటి కీలక ప్రాజెక్టులపై దృష్టి పెట్టామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ–బందర్ పోర్ట్ గ్రీన్‌ఫీల్డ్ హైవే, NH-167 అభివృద్ధి, కరీంనగర్–వరంగల్ హైవే, HAM పద్ధతిలో గ్రామీణ రోడ్ల నిర్మాణం కూడా ముఖ్యమైన ప్రాజెక్టులని పేర్కొన్నారు.
**గడ్కరీ, సీఎం రేవంత్ రెడ్డితో సమీక్ష**
IRC సమావేశాలను ప్రారంభించిన అనంతరం తెలంగాణలో రోడ్ల నిర్మాణం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను కలిసి IRC వేదికగా సమీక్ష సమావేశం నిర్వహిస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు.
**రైతులు, పరిశ్రమలకు మెరుగైన రవాణా సౌకర్యాలు**
మంచి రోడ్లు ఉంటేనే రైతులు తమ పంటలను త్వరగా మార్కెట్లకు తీసుకెళ్లగలుగుతారని, పరిశ్రమలు తమ ఉత్పత్తులను సులభంగా రవాణా చేయగలుగుతాయని మంత్రి అన్నారు. ప్రజలకు ప్రయాణ సమయం, ఖర్చు తగ్గుతాయని, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వివరించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ కల్పిస్తే పారిశ్రామిక రంగం వేగంగా విస్తరిస్తుందని చెప్పారు.
2025–26లో రాష్ట్ర GSDP సుమారు రూ.17.82 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్న మంత్రి, తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యంలో భాగంగా 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ఈ లక్ష్యాలను సాధించాలంటే హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాలకు మెరుగైన రోడ్డు కనెక్టివిటీ ఉండాలని, 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ ద్వారా దేశవిదేశాల నిపుణుల అనుభవం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెలంగాణకు ఉపయోగపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments
Post a Comment