# మోయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారిణి ఆస్తులు రూ.6.76 కోట్లు!
# మోయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారిణి ఆస్తులు రూ.6.76 కోట్లు!
## ఏకకాలంలో 8 చోట్ల ఏసీబీ సోదాలు.. భారీగా స్థిర, చరాస్తుల గుర్తింపు
### గతంలో రూ.75 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారిణి
**హైదరాబాద్:** ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఆదాయ వనరులకు మించి అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో సోమవారం (16-11-2026) ఆమె నివాసంతో పాటు కార్యాలయం, బంధువులు, సన్నిహితులు, బినామీలకు సంబంధించిన మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
**రూ.6.76 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!**
ఈ సోదాల్లో భారీగా స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలు, ఇతర వివరాలను అధికారులు గుర్తించారు. ఏసీబీ ప్రెస్‌నోట్ ప్రకారం గుర్తించిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.
**స్థిరాస్తులు:**
1. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 283.11 చదరపు గజాల ఓపెన్ ప్లాట్.
2. జనగామ జిల్లా పాలకుర్తిలో 424 చదరపు గజాల మరో ఓపెన్ ప్లాట్. ఈ రెండు ప్లాట్ల విలువ రూ.87.67 లక్షలు.
3. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో నివాస ఫ్లాట్ విలువ రూ.63 లక్షలు.
4. అత్తాపూర్‌లోనే జీ+2 అంతస్తుల నివాస భవనం విలువ సుమారు రూ.2.45 కోట్లు.
5. మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలంలో 1.10 ఎకరాల వ్యవసాయ భూమి విలువ రూ.29.70 లక్షలు.
**చరాస్తులు, పెట్టుబడులు:**
- నగదు రూ.5,47,500.
- మహబూబ్‌నగర్‌లోని తుల్జాభవాని వైన్స్‌లో పెట్టుబడి రూ.50 లక్షలు.
- షేర్లలో పెట్టుబడులు రూ.1.30 కోట్లు.
- బ్యాంకు ఖాతాల్లో నిల్వలు రూ.7,97,238.
- సుమారు 175.1 గ్రాముల బంగారు ఆభరణాలు, విలువ రూ.2.54 లక్షలు.
- మహీంద్రా XUV700, హ్యుందాయ్ క్రెటా కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు కలిపి రూ.50 లక్షలు.
- గృహోపకరణాల విలువ రూ.5.10 లక్షలు.
ఈ విధంగా అధికారిణికి సంబంధించిన మొత్తం ఆస్తుల విలువ రూ.6,76,45,738గా (రూ.6.76 కోట్లు) ఏసీబీ ప్రాథమికంగా అంచనా వేసింది. వీటి అధికారిక విలువ కంటే మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ వెల్లడించింది. మరిన్ని ఆస్తుల వివరాలపై పరిశీలన కొనసాగుతోందని తెలిపింది.
**గతంలో రూ.75 వేల లంచం కేసు!**
గతంలోనూ గుండు వాణిపై ఏసీబీ కేసు నమోదైంది. 30-09-2026న మోయినాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారిణిగా పనిచేస్తున్న సమయంలో పంచాయతీ కార్యదర్శి ద్వారా రూ.75 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో ఆమెను అరెస్టు చేయగా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు ఏసీబీ వెల్లడించింది.
తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్ 13(1)(b) రెడ్‌విత్ 13(2) కింద కేసు నమోదు చేశారు. ఆమెను హైదరాబాద్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు పీటీ వారెంట్‌పై హాజరుపరచనున్నట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.
ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని ఏసీబీ స్పష్టం చేసింది.

Comments
Post a Comment