# మార్క్‌ఫెడ్ ప్రొక్యూర్‌మెంట్‌లో ఆ ఉద్యోగిదే రాజ్యం!
# మార్క్‌ఫెడ్ ప్రొక్యూర్‌మెంట్‌లో ఆ ఉద్యోగిదే రాజ్యం!
## పదేళ్లుగా ఒకే సెక్షన్‌లో తిష్ఠ.. బదిలీ నిబంధనలు బేఖాతర్?
### ఉద్యోగి కొనసాగింపునకు అండగా నిలిచిందెవరు? అడ్మిన్, హెచ్‌ఆర్ అధికారుల పాత్రపైనా విచారణకు డిమాండ్!
### గన్నీ బ్యాగులు, రవాణా కాంట్రాక్టర్లు, సరఫరాదారుల వ్యవహారాల్లో పెత్తనంపై ఆరోపణలు.. CCA రూల్స్ ప్రకారం చర్యలకు పట్టుబాటు!
**హైదరాబాద్:** తెలంగాణ మార్క్‌ఫెడ్‌లోని ప్రొక్యూర్‌మెంట్ విభాగం వ్యవహారశైలి ఇప్పుడు సంస్థలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ బదిలీ మార్గదర్శకాలు, సంస్థాగత పరిపాలనా నిబంధనలు ఉన్నప్పటికీ ఓ ఉద్యోగి ఏకంగా పదేళ్లుగా ఒకే కీలక సెక్షన్‌లో కొనసాగుతున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బదిలీలకు ప్రభుత్వం 2024, 2026లో వెసులుబాటు కల్పించిన సందర్భాల్లోనూ సదరు ఉద్యోగి స్థానంలో మార్పు రాకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఒక ఉద్యోగి ఇంత సుదీర్ఘకాలం ఒకే విభాగంలో కొనసాగడానికి కారణం ఏమిటి? ఆ ఉద్యోగికి ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయా? లేక ఉన్నతాధికారుల అండదండలే ఇందుకు కారణమా? అన్న చర్చ ఉద్యోగవర్గాల్లో సాగుతోంది.
**కీలక విభాగం.. కాంట్రాక్టర్లతో నిరంతర సంబంధాలు!**
రైతుల నుంచి కనీస మద్దతు ధరకు మొక్కజొన్న, కందులు, పెసర్లు తదితర పంటలను సేకరించడంలో మార్క్‌ఫెడ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ కొనుగోళ్లకు అవసరమైన గన్నీ బ్యాగుల సరఫరా, రవాణా ఏర్పాట్లు, ఇతర ప్రొక్యూర్‌మెంట్ కార్యకలాపాలు అత్యంత ప్రాధాన్యత కలిగినవి. ఈ నేపథ్యంలో గన్నీ బ్యాగుల సరఫరాదారులు, రవాణా కాంట్రాక్టర్లు, ఇతర ఏజెన్సీలతో ఈ విభాగానికి నిరంతర సంబంధాలు ఉంటాయి. ఇలాంటి కీలకమైన సెక్షన్‌లో ఒకే ఉద్యోగి పదేళ్లుగా కొనసాగుతున్నారన్న ఆరోపణలు పరిపాలనా పారదర్శకతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కీలక బాధ్యతలు ఒకే వ్యక్తి చేతిలో ఇంతకాలం ఉండటం వల్ల ప్రయోజనాల సంఘర్షణకు, అధికార కేంద్రీకరణకు అవకాశం ఏర్పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
**ఆ ఉద్యోగి చెప్పిందే వేదమా? కాంట్రాక్టర్లపై పెత్తనం?**
ప్రొక్యూర్‌మెంట్ విభాగంలో సదరు ఉద్యోగి చెప్పిందే నడుస్తోందని, ఆ ఉద్యోగి వహారశైలిని ఉన్నతాధికారులు సైతం ప్రశ్నించడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న మరో ఉద్యోగితో కలిసి గన్నీ బ్యాగుల సరఫరాదారులు, రవాణా కాంట్రాక్టర్లు, ఇతర సరఫరాదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం. ఈ ఆరోపణల్లో వాస్తవమెంత? ఎవరైనా అధికారికంగా ఫిర్యాదులు చేశారా? వాటిపై విచారణ జరిగిందా? కాంట్రాక్టర్లకు సంబంధించిన పనుల కేటాయింపు, బిల్లుల చెల్లింపులు, సరఫరాల పర్యవేక్షణలో నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలపై సమగ్ర పరిశ జరగాల్సిన అవసరం ఉంది
**పదేళ్ల కొనసాగింపునకు బాధ్యులెవరు? అడ్మిన్, హెచ్‌ఆర్ అధికారుల పాత్రపై ప్రశ్నలు!**
ఈ వ్యవహారంలో కేవలం సదరు ఉద్యోగి పాత్రపైనే కాకుండా, ఆయన ఇంత సుదీర్ఘకాలం ఒకే సెక్షన్‌లో కొనసాగడానికి అవకాశం కల్పించిన అడ్మినిస్ట్రేషన్, హెచ్‌ఆర్ విభాగాల అధికారుల బాధ్యతపైనా విచారణ జరపాలని మార్క్‌ఫెడ్‌కు చెందిన కొందరు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ఒక ఉద్యోగి పదేళ్లుగా ఒకే కీలక సెక్షన్‌లో పనిచేస్తుంటే ఆ విషయం అడ్మినిస్ట్రేషన్ అధికారులకు తెలియదా? ఉద్యోగుల సర్వీసు రికార్డులు, సెక్షన్ల వారీగా పని కేటాయింపులు, బదిలీలను పర్యవేక్షించాల్సిన హెచ్‌ఆర్ విభాగం ఏం చేస్తోంది? బదిలీ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చినప్పుడు సదరు ఉద్యోగిని ఎందుకు బదిలీ చేయలేదు? బదిలీ ప్రతిపాదనలు రూపొందించలేదా? ఒకవేళ ప్రత్యేక మినహాయింపు ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఎక్కడున్నాయి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
**ఉద్యోగినే కాదు.. కొనసాగించిన అధికారులనూ బాధ్యులను చేయాలి!**
సదరు ఉద్యోగి దీర్ఘకాలిక కొనసాగింపులో అడ్మినిస్ట్రేషన్, హెచ్‌ఆర్ అధికారుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన లేదా ఇతరత్రా బాధ్యతారాహిత్యం ఉన్నట్లు తేలితే వారిని కూడా విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఉద్యోగులు కోరుతున్నారు. కేవలం ఒక ఉద్యోగిపై చర్యలు తీసుకుని, ఇన్నేళ్లుగా ఆయన కొనసాగింపునకు బాధ్యత వహించిన అధికారులను వదిలేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో సంబంధిత ఉద్యోగి, అడ్మినిస్ట్రేషన్ అధికారులు, హెచ్‌ఆర్ విభాగం అధికారుల పాత్రపై సమగ్ర శాఖాపరమైన విచారణ జరిపించి, బాధ్యతలు నిర్ధారించాలని డిమాండ్ చేస్తున్నారు. విచారణలో తప్పిదాలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే సంబంధిత సర్వీస్ నిబంధనలు, వర్తించే CCA రూల్స్ ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు.
**ఉన్నతాధికారుల మౌనం వెనుక మర్మమేమిటి?**
మార్క్‌ఫెడ్‌లో కీలకమైన ప్రొక్యూర్‌మెంట్ విభాగంపై ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పదేళ్లుగా ఒకే సెక్షన్‌లో కొనసాగుతున్న ఉద్యోగి వ్యవహారంపై ఇప్పటివరకు అంతర్గత సమీక్ష జరిగిందా? కాంట్రాక్టర్లు, సరఫరాదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారా? ఉద్యోగుల బదిలీ విధానంలో అందరికీ ఒకే నిబంధనలు అమలవుతున్నాయా? అనే అంశాలపై సంస్థ యాజమాన్యం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
* సమగ్ర విచారణ జరిపించాలని *కొంతమంది ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నారు.
సదరు ఉద్యోగి పదేళ్లుగా ఒకే సెక్షన్‌లో కొనసాగుతున్న కాలానికి సంబంధించిన పూర్తి సర్వీసు, పోస్టింగ్ వివరాలను పరిశీలించాలనీ, బదిలీ మార్గదర్శకాల ప్రకారం ఆ ఉద్యోగికి ఏమైనా మినహాయింపులు ఇచ్చారా? ఇస్తే వాటికి సంబంధించిన ఉత్తర్వులను వెల్లడించాలని , గన్నీ బ్యాగుల సరఫరా, రవాణా కాంట్రాక్టులు, ఇతర ప్రొక్యూర్‌మెంట్ వ్యవహారాల్లో నిబంధనల అమలును తనిఖీ చేయాలని కాంట్రాక్టర్లు, సరఫరాదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు ఉంటే వాటిపై విచారణ జరపాలని , సదరు ఉద్యోగి కొనసాగింపునకు బాధ్యత వహించిన అడ్మినిస్ట్రేషన్, హెచ్‌ఆర్ అధికారుల పాత్రను కూడా పరిశీలించాలనీ మరియు విజిలెన్స్ చే విచారణ చేయించాలని విచారణలో బాధ్యతారాహిత్యం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే సంబంధిత అధికారులపై కూడా వర్తించే CCA రూల్స్ ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ యాజమాన్యం తక్షణమే స్పందించి కింది అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని సంస్థకు చెందిన కొందరు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు
**అసలు ప్రశ్న ఒక్కటే.. మార్క్‌ఫెడ్‌లో బదిలీ నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయా? లేక ప్రొక్యూర్‌మెంట్ సెక్షన్‌లో పదేళ్లుగా కొనసాగుతున్న ఉద్యోగికి, ఆయన కొనసాగింపునకు బాధ్యులైన అధికారులకు ప్రత్యేక వెసులుబాటు ఉందా?**
సంస్థలో పారదర్శకత, జవాబుదారీతనం కాపాడాలంటే ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాల్సిందే. మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులు ఇప్పటికైనా మౌనం వీడి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి.
**ఈ వ్యవహారంపై గూఢచారి పరిశోధన కొనసాగుతుంది!**

Comments
Post a Comment