బిల్డర్లకు టీజీ రెరా కొరడా.. ఎనిమిది సంస్థలపై భారీ జరిమానాలు
బిల్డర్లకు టీజీ రెరా కొరడా.. ఎనిమిది సంస్థలపై భారీ జరిమానాలు
• కొనుగోలుదారులకు వడ్డీతో సహా నగదు వాపసు చేయాలని ఆదేశం
• నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
హైదరాబాద్, నవంబర్ 17:
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కొనుగోలుదారులను మోసగిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) కఠిన చర్యలకు ఉపక్రమించింది. రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాజెక్టుల విక్రయాలు జరపడం, గడువు ముగిసినా ఇళ్లను అప్పగించకపోవడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన ఎనిమిది నిర్మాణ సంస్థలపై కొరడా ఝుళిపించింది. బాధిత కొనుగోలుదారులకు న్యాయం చేస్తూ, 45 రోజుల్లోగా వడ్డీతో సహా డబ్బును తిరిగి చెల్లించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.
సంస్థల వారీగా రెరా ఆదేశాలు ఇవే..
• భువంతేజ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్: సంగారెడ్డి జిల్లా వెలిమలలోని 'ఆరా' ప్రాజెక్టులో ఫ్లాట్ అప్పగించనందుకు బాధితులకు రూ. 26 లక్షలను 10.85% వార్షిక వడ్డీతో చెల్లించాలి. ఈ సంస్థను డిఫాల్టర్‌గా ప్రకటిస్తూ, భవిష్యత్తులో ఏ ప్రాజెక్టులలోనూ విక్రయాలు జరపకుండా నిషేధం విధించింది.
• సనాలి ఐటీ పార్క్స్: మంచిరేవులలో అనుమతులు లేని 'సనాలి ది ఎడ్జ్' ప్రాజెక్టును ప్రచారం చేసినందుకు రూ. 25 లక్షల జరిమానా విధించింది. రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించింది.
• త్రిపుర కన్‌స్ట్రక్షన్స్: తెల్లాపూర్ ప్రాజెక్టుకు అనుమతులు పొందడంలో విఫలమైనందున, కొనుగోలుదారులకు వడ్డీతో సహా రూ. 41.85 లక్షలు తిరిగి ఇవ్వాలి.
• ఎస్‌వీఎం ఆదిత్య హోమ్స్: రిజిస్ట్రేషన్ లేని 'టెక్ హోమ్స్' విల్లా ప్రాజెక్టును పూర్తి చేయనందుకు 10.85% వడ్డీతో రూ. 27.16 లక్షలు వాపసు చేయాలి.
• శ్రీ ఆదిత్య స్క్వేర్స్: రద్దు ఛార్జీల పేరుతో 15 శాతం కోత విధించాలన్న సంస్థ వాదనను తోసిపుచ్చుతూ, వడ్డీతో సహా రూ. 17 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
• వాసవి రియల్టర్స్: 'వాసవి లేక్ సిటీ ఈస్ట్' ప్రాజెక్టులో ఫ్లాట్ అప్పగింత ఆలస్యమైనందున, వసూలు చేసిన రూ. 49.50 లక్షలపై 2025 ఫిబ్రవరి 7 నుండి 10.85% వార్షిక వడ్డీ చెల్లించాలి.
• అరైన్ ఇన్‌ఫ్రా: మియాపూర్‌లోని 'అరైన్ ఎమరాల్డ్' ప్రాజెక్టులో ఫ్లాట్ నంబర్ 502ను కొనుగోలుదారుకు అప్పగించడంతో పాటు, ఆలస్యానికి 10.85% వడ్డీ చెల్లించాలి.
• బీవీఆర్ ఇన్‌ఫ్రా డెవలపర్స్: మహేశ్వరంలో 184 చదరపు గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయనందుకు బాధితుడికి వడ్డీతో సహా రూ. 7 లక్షలు వాపసు ఇవ్వాలి.
కొనుగోలుదారులకు సూచన:
సొంతింటి కల నెరవేర్చుకునే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీజీ రెరా అధికారులు సూచించారు. ఏదైనా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే ముందు దానికి రెరా అనుమతులు ఉన్నాయో లేదో అధికారిక వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని పేర్కొన్నారు.

Comments
Post a Comment