జవహర్‌నగర్ డంప్‌యార్డు తరలింపునకు ఈటల పోరుబాట
జవహర్‌నగర్ డంప్‌యార్డు తరలింపునకు ఈటల పోరుబాట
27 నుంచి బాధితులతో పాదయాత్ర.. శాశ్వత పరిష్కారం వచ్చే వరకు రాజీపడేది లేదన్న మల్కాజిగిరి ఎంపీ
హైదరాబాద్, అక్టోబర్ 25: జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు వల్ల తీవ్ర కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపే వరకు రాజీపడే ప్రసక్తే లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. డంపింగ్‌యార్డును తరలించడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27 నుంచి బాధిత ప్రజలతో కలిసి పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.
బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో జవహర్‌నగర్ డంప్‌యార్డు కాలుష్య నియంత్రణ, సమస్యలకు శాశ్వత పరిష్కారంపై ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ మురళీ మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, పర్యావరణవేత్తలు దొంతి నరసింహారెడ్డి, మల్లికార్జునరెడ్డి, దామోదర్‌రెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
ఈటల రాజేందర్ మాట్లాడుతూ హైదరాబాద్‌కు పెద్దఎత్తున ఆదాయం అందించే ప్రాంత ప్రజలు కాలుష్య కోరల్లో బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జవహర్‌నగర్ సమస్యను పార్లమెంట్లో ప్రస్తావించడంతో పాటు కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలిసి సమస్యను వివరించినట్లు తెలిపారు. ఢిల్లీలో వ్యర్థాల నిర్వహణకు అనుసరిస్తున్న విధానాలను పరిశీలించానని, శాస్త్రీయ పద్ధతులతో చెత్తను ప్రాసెస్ చేస్తే విద్యుత్, బయోగ్యాస్, సేంద్రీయ ఎరువులు వంటి వనరులను ఉత్పత్తి చేయవచ్చన్నారు.
డంప్‌యార్డు నుంచి వెలువడుతున్న మీథేన్, లీచేట్ తదితర కాలుష్య కారకాల ప్రభావంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జవహర్‌నగర్‌లో పేరుకుపోయిన పాత చెత్తను తొలగించినా భూగర్భజలాలు, చెరువులపై ఏర్పడిన ప్రభావం వెంటనే తొలగిపోదని, అందుకే దీర్ఘకాలిక శాస్త్రీయ ప్రణాళిక అవసరమన్నారు.
చెత్త సేకరణలో గుత్తాధిపత్యం వద్దు
చెత్త సేకరణ, వేరు చేసే ప్రక్రియలో చిన్న కార్మికులు, ఆటో డ్రైవర్లకు ఉపాధి దెబ్బతినకూడదన్నారు. రాంకీ సంస్థ గుత్తాధిపత్యం కారణంగా చెత్త సేకరణ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. ఆటో కార్మికులపై బౌన్సర్లతో దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరపాలని కోరారు.
రూ.2,000–3,000 కోట్ల కేంద్ర నిధులు తెస్తా
జవహర్‌నగర్ సమస్య పరిష్కారానికి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రూ.2,000 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు నిధులు తీసుకురావడానికి తాను బాధ్యత తీసుకుంటానని ఈటల రాజేందర్ ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు.
నాలుగు దిక్కుల్లో వ్యర్థాల శుద్ధి కేంద్రాలు: నిపుణులు
సమావేశంలో పాల్గొన్న పర్యావరణ నిపుణులు హైదరాబాద్ నగరంలోని మొత్తం చెత్తను ఒకే ప్రాంతంలో కేంద్రీకరించడం వల్లే జవహర్‌నగర్‌పై భారం పెరిగిందని అభిప్రాయపడ్డారు. నగరాన్ని ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరగా విభజించి ఆధునిక వ్యర్థాల శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. లీచేట్ భూగర్భజలాల్లోకి చేరకుండా, మీథేన్ వాయువులు బయటకు రాకుండా శాస్త్రీయ సాంకేతికతను వినియోగించాలని కోరారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రముఖ పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ కాలుష్యానికి కుల, మత, రాజకీయ భేదాలు ఉండవని, గాలి-నీరు కలుషితమైతే ప్రతి ఒక్కరూ బాధితులవుతారని అన్నారు. తడి, పొడి చెత్తను ఇళ్ల నుంచే వేరు చేసే విధానాన్ని ప్రజలు క్రమశిక్షణతో పాటించాలని సూచించారు. గతంలో నిపుణుల కమిటీలు చేసిన సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
జవహర్‌నగర్‌ను కాలుష్య విముక్తం చేయాలి
మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు మాట్లాడుతూ జవహర్‌నగర్ ప్రజలు భారీ మొత్తంలో చెత్త భారాన్ని భరిస్తున్నారని, ఇది సామాజిక న్యాయంతో పాటు పర్యావరణ న్యాయానికి సంబంధించిన సమస్యగా మారిందన్నారు. జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాల్లోని ఆధునిక సాంకేతికతను వినియోగించి ‘వేస్ట్ టు వెల్త్’ విధానాన్ని అమలు చేయాలని సూచించారు.
పర్యావరణవేత్త దొంతి నరసింహారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ చెత్త నిర్వహణ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, చెత్తను వేరు చేయకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తోందన్నారు.
బండ కార్తీకరెడ్డి మాట్లాడుతూ జవహర్‌నగర్ డంప్‌యార్డు చుట్టూ గాలి, నీరు, నేల కాలుష్యం తీవ్రంగా ఉందని, ప్రత్యామ్నాయ డంపింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని ఆరోపించారు. డంప్‌యార్డును తరలించి ప్రజలను కాలుష్యం నుంచి విముక్తి చేయాలని డిమాండ్ చేశారు.
జాజుల శ్రీనివాస్ గౌడ్, తిప్పారపు లక్ష్మణ్ తదితరులు ఈటల రాజేందర్ చేపట్టనున్న పాదయాత్రకు మద్దతు ప్రకటించారు. జవహర్‌నగర్ ప్రజలపై చెత్త భారాన్ని మోపడం అన్యాయమని తిప్పారపు లక్ష్మణ్ పేర్కొన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జవహర్‌నగర్ పరిసరాల్లో కాలుష్య నియంత్రణకు శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణతో పాటు ప్రజల్లో పౌర స్పృహ, చెత్త వర్గీకరణపై అవగాహన పెంచాలని సూచించారు.
27 నుంచి పాదయాత్ర
జవహర్‌నగర్‌కు కొత్తగా ఒక్క కిలో చెత్త కూడా రాకుండా చేయడంతో పాటు ఇప్పటికే పేరుకుపోయిన చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగుతుందని, ఈ నెల 27 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. జవహర్‌నగర్ డంప్‌యార్డు సమస్యపై ఈ పాదయాత్రతో ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపారు.

Comments
Post a Comment