# టీజీపీసీబీ సమావేశ హాల్ ముందు విజిటర్స్ చైర్స్ దగ్గర కాలుష్య నమూనాల నిల్వ!


 # టీజీపీసీబీ సమావేశ హాల్ ముందు  విజిటర్స్ చైర్స్ దగ్గర కాలుష్య నమూనాల నిల్వ!

## ప్రయోగశాలకు చేరాల్సిన శాంపిళ్లు కుర్చీల పక్కన.. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమా?

### నమూనాల భద్రతపై నీలినీడలు.. పరీక్షల జాప్యంపై సమాధానం చెప్పేదెవరు?

**హైదరాబాద్:** పర్యావరణ పరిరక్షణకు కీలక బాధ్యత వహించాల్సిన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) కార్యాలయంలోనే విస్మయకర దృశ్యం కనిపిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన కాలుష్య పరీక్షల నమూనాలు ప్రయోగశాలకు చేరాల్సి ఉండగా, ఏకంగా కార్యాలయంలోని సమావేశ హాల్ ముందు విజిటర్స్ చైర్స్  పక్కన ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వ ఉంచడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు అధికారుల పనితీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

సమావేశ హాల్లో వరుసగా కనిపిస్తున్న క్యాన్లలో అసలు ఏయే రకాల నమూనాలు ఉన్నాయి? కేవలం నీటి నమూనాలేనా? లేక పరిశ్రమల నుంచి సేకరించిన వ్యర్థ జలాలు, రసాయన వ్యర్థాలు, చెరువులు, నదులు, భూగర్భ జలాల నమూనాలు కూడా ఉన్నాయా? మట్టి, ఘన వ్యర్థాలు, పరిశ్రమల కాలుష్య ఉద్గారాల పరీక్షలకు సంబంధించిన నమూనాలు సైతం ఉన్నాయా? అన్నది అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది.

పర్యావరణ నమూనాల సేకరణ, రవాణా, నిల్వ, పరీక్షలకు నిర్దిష్ట విధివిధానాలు ఉంటాయి. నమూనాల స్వభావాన్ని బట్టి ఉష్ణోగ్రత, నిల్వ సమయం, ప్రత్యేక భద్రతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. అలాంటిది సమావేశ హాల్లో సాధారణ ప్లాస్టిక్ క్యాన్లలో వాటిని ఎందుకు నిల్వ ఉంచారు? ఏయే ప్రాంతాల నుంచి ఎప్పుడు సేకరించారు? ఎన్ని రోజులుగా అక్కడే ఉన్నాయి? ప్రయోగశాలకు తరలించడంలో ఎందుకు జాప్యం జరుగుతోంది? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

నమూనాలను నిర్ణీత సమయంలో పరీక్షించకపోతే వాటి స్వభావాన్ని బట్టి నాణ్యతలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల పరీక్షా ఫలితాల విశ్వసనీయతపై ప్రభావం పడుతుందా? నిల్వకు సంబంధించి నిర్దేశించిన ప్రమాణాలు పాటిస్తున్నారా? ఉష్ణోగ్రత, భద్రత, నిల్వ సమయానికి సంబంధించిన నిబంధనలు అమలవుతున్నాయా? అన్న అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

అసలు ఎన్ని నమూనాలు పరీక్షలకు పెండింగ్‌లో ఉన్నాయి? ఇప్పటివరకు ఎన్ని నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించారు? వాటి పరీక్షా నివేదికలు సిద్ధమయ్యాయా? నమూనాల సేకరణ నుంచి పరీక్షల వరకు బాధ్యత వహించే అధికారులు ఎవరు? సమావేశ హాల్లో వాటిని నిల్వ ఉంచాలని ఎవరు ఆదేశించారు? ప్రయోగశాలకు తరలించకుండా కార్యాలయంలోనే ఉంచడం వెనుక కారణాలేమిటి? ఒకవేళ నిల్వ విధానంలో లోపాలు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? అన్న ప్రశ్నలకు TGPCB అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది.

పరిశ్రమలు, కాలుష్య ప్రభావిత ప్రాంతాలపై చర్యలు తీసుకోవడానికి నమూనాల పరీక్షా ఫలితాలే కీలక ఆధారం. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణతో ముడిపడిన ఇంత కీలకమైన వ్యవహారంలోనే నిర్లక్ష్యం కనిపిస్తే కాలుష్య నియంత్రణ చర్యలపై ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుంది? కాలుష్యాన్ని నియంత్రించాల్సిన సంస్థలోనే నమూనాల నిర్వహణ ఇలా ఉంటే పర్యావరణ పరిరక్షణపై భరోసా కల్పించేదెవరు?

ఈ వ్యవహారంపై TGPCB ఛైర్మన్, సభ్య కార్యదర్శి మరియు చీఫ్ ఇంజనీర్ తక్షణమే స్పందించి సమావేశ హాల్లో నిల్వ ఉంచిన నమూనాలన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలి. వాటి రకాలు, సేకరణ తేదీలు, నిల్వ పరిస్థితులు, ప్రయోగశాల పరీక్షల స్థితిగతులను వెల్లడించాలి. విధుల్లో నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.


**— గూఢచారి ప్రత్యేక కథనం**

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు