ఈ నెలలోనే ఏడుగురు అవినీతి అధికారుల అరెస్ట్*

 



*తెలంగాణలో ఏసీబీ కొరడా.. ఈ నెలలోనే ఏడుగురు అవినీతి అధికారుల అరెస్ట్*


*హైదరాబాద్, నవంబరు 15:* తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ రైళ్లు పరిగెత్తిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచావతారాల ఆట కట్టించేందుకు ఏసీబీ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. కేవలం ఈ ఒక్క నెలలోనే ఏడుగురు అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు.


ప్రభుత్వ పనుల కోసం వచ్చే సామాన్య ప్రజల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్న అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతోంది. బాధితుల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే పక్కా వ్యూహంతో వలపన్ని అవినీతి అధికారులను పట్టుకుంటోంది.


కీసర సబ్ ఇన్‌స్పెక్టర్ కొండారెడ్డి శ్రీనివాస్ బాధితుడిపై ఉన్న కేసుల్లో విచారణ వేగవంతం చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఏకంగా రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. భైంసా ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఒక పని నిమిత్తం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. విద్యుత్ శాఖ అధికారులు పాత మీటర్ల స్థానంలో కొత్త కరెంట్ మీటర్లను మంజూరు చేయడానికి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్‌ను ఆమోదించేందుకు రూ.1.2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పీఎంకేఎస్‌వై కాంట్రాక్టర్‌కు సంబంధించిన పెండింగ్ బిల్లులు పాస్ చేయడానికి లంచం డిమాండ్ చేస్తూ ప్రాజెక్ట్ ఆఫీసర్ సతీష్ రెడ్డి, టెక్నికల్ ఆఫీసర్ రాజు దొరికిపోయారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఇద్దరు క్రీడా శాఖ అధికారులు ఒక పని కోసం రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసి ఏసీబీ చేతికి చిక్కారు.


ఈ నెలలో పట్టుబడిన ఈ అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి అక్రమాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పోలీస్ స్టేషన్లు, మున్సిపాలిటీలు, విద్యుత్ బోర్డులు ఇలా ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా రేటు కట్టి మరీ సామాన్యుల నుంచి వసూలు చేస్తున్న తీరు ఈ దాడులతో బట్టబయలైంది. అవినీతి రహిత రాష్ట్రమే లక్ష్యంగా ఏసీబీ తన దూకుడును మరింత పెంచడంతో ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతి అధికారులు బెంబేలెత్తిపోతున్నారు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?