*ఓలెక్ట్రా EBITDAలో 18 శాతం వృద్ధి.. రూ.687 కోట్లకు చేరిన ఆదాయం*
*ఓలెక్ట్రా EBITDAలో 18 శాతం వృద్ధి.. రూ.687 కోట్లకు చేరిన ఆదాయం*
*హైదరాబాద్, నవంబరు 9:* ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది.
గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 5 శాతం పెరిగి రూ.687.01 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం (EBITDA) 18 శాతం వృద్ధితో రూ.109.89 కోట్లకు చేరింది. పన్నుల అనంతర లాభం (PAT) 5 శాతం పెరిగి రూ.52.12 కోట్లుగా నమోదైంది.
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ 401 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే సమయంలో 375 వాహనాలు విక్రయించగా, ఈసారి 7 శాతం వృద్ధి సాధించింది. తొలి ఆరు నెలల్లో మొత్తం 759 వాహనాలను డెలివరీ చేసింది.
ఓలెక్ట్రా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,750కు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేసింది. 55 నగరాల్లో ప్రజా రవాణా సేవలకు బస్సులను అందిస్తోంది. ఈ వాహనాలు ఇప్పటివరకు 750 మిలియన్లకు పైగా గ్రీన్ కిలోమీటర్లు ప్రయాణించాయి. కంపెనీ వద్ద 8,000కు పైగా ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్లు ఉన్నాయి.
నాలుగో త్రైమాసికంలో కొత్త తరం ఎలక్ట్రిక్ బస్సులను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఓలెక్ట్రా మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ బాబు తెలిపారు. స్థానిక తయారీకి ప్రాధాన్యం ఇస్తూ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా వీటిని అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
త్రైమాసిక ఫలితాలు ఆదాయం, వాహన విక్రయాలు, లాభదాయకతలో స్థిరమైన వృద్ధిని ప్రతిబింబిస్తున్నాయని ఆయన తెలిపారు.

Comments
Post a Comment