ఆర్యవైశ్య మహాసభలో 'కీలక' నియామకాలు.. బైలా వివాదంపై రిజిస్ట్రార్ నజర్!
ఆర్యవైశ్య మహాసభలో 'కీలక' నియామకాలు.. బైలా వివాదంపై రిజిస్ట్రార్ నజర్!
హైదరాబాద్:గూఢచారి: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఎట్టకేలకు కీలక సర్దుబాటు పూర్తయింది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఎన్నికల్లో కొద్దిపాటి మెజారిటీతో పీఠాన్ని దక్కించుకున్న అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, దాదాపు రెండు నెలల సుదీర్ఘ కసరత్తు తర్వాత తన కోటరీని సిద్ధం చేసుకున్నారు. మహాసభ ప్రధాన కార్యదర్శిగా కొండ్లే మల్లికార్జున్ ను నియమించారు, కోశాధికారిగా రేణుకంట్ల గణేష్ గుప్తాను ఖరారు చేసినట్లు సోషల్ మీడియా లో చర్చ జరుగుతుంది. ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంఘంలో హాట్ టాపిక్‌గా మారింది.
అసంతృప్తుల నడుమ నియామకాల జోరు!
ఎన్నికలు ముగిసి రెండు నెలలు గడుస్తున్నా కార్యవర్గ విస్తరణ జరగకపోవడంతో ఇన్నాళ్లూ రకరకాల ఊహాగానాలు సాగాయి. తీరా ఇప్పుడు నియామకాలు జరిపినా, అంతర్గతంగా అందరినీ సమన్వయం చేయడం అమరవాదికి అంత తేలికైన విషయమేమీ కాదనే టాక్ వినిపిస్తోంది. ఒకవైపు ఈ పదవుల పంపకంపై హర్షం వ్యక్తమవుతుండగా, మరోవైపు ఆశావహుల అసంతృప్తి సెగలు కూడా లోపాయికారీగా పొగలుగక్కుతున్నట్లు సమాచారం.
తెరపైకి 'బైలా' వివాదం.. రిజిస్ట్రార్ నోటీసుల కలకలం!
ఇదిలా ఉంటే, ఈ నియామకాల సంతోషం కంటే మహాసభకు పొంచి ఉన్న లీగల్ చిక్కులే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ మహాసభ బైలా (By-Law), రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ యాక్ట్ సెక్షన్ 14 కు పూర్తి వ్యతిరేకంగా ఉందంటూ పలువురు సభ్యులు గట్టిగానే పావులు కదిపారు. ఈ మేరకు సొసైటీస్ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదులు వెళ్లడం, దానికి స్పందించిన రిజిస్ట్రార్ కార్యాలయం మహాసభకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఆర్యవైశ్యుల్లో ఉత్కంఠ.. తదుపరి అడుగు ఎటు?
చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఇప్పుడు రిజిస్ట్రార్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఈ నోటీసులకు అమరవాది లక్ష్మీనారాయణ బృందం ఎలాంటి న్యాయపరమైన, సాంకేతిక వివరణ ఇవ్వబోతోంది? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. రిజిస్ట్రార్ చర్యలు కఠినంగా ఉంటే కొత్త కార్యవర్గ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది. ఏది ఏమైనా, ఓ పక్క పదవుల పంపకాల జోష్.. మరోపక్క రిజిస్ట్రార్ నోటీసుల టెన్షన్ నడుమ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వజాతి బంధువులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!
— గూఢచారి ప్రతినిధి

Comments
Post a Comment