“వీరి వీరి గుమ్మడి పండు... వీరి పేరు ఏమి?” – TGPCBలో ‘ఎక్కడి వాళ్లు అక్కడే గప్ చుప్' డిప్యుటేషన్‌ల ఆట మళ్లీ మొదలా?

“వీరి వీరి గుమ్మడి పండు... వీరి పేరు ఏమి?” – TGPCBలో ‘ఎక్కడి వాళ్లు అక్కడే గప్ చుప్'  డిప్యుటేషన్‌ల ఆట మళ్లీ మొదలా?

ట్రాన్స్‌ఫర్లు ఒక వైపు... డిప్యుటేషన్లు మరో వైపు!

తెలంగాణ పీసీబీలో అక్రమ డిప్యుటేషన్‌లకు సర్వం సిద్ధమనే ప్రచారం!

హైదరాబాద్:

“వీరి వీరి గుమ్మడి పండు... వీరి పేరు ఏమి?” అనే పాటలో చివరి చరణం “ఎక్కడి వాళ్లు అక్కడ గప్ చుప్"  అన్నట్లుగా, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB)లో బదిలీలు జరిగినా కొందరు ఉద్యోగులు, అధికారులు మళ్లీ తమకు అనుకూల ప్రాంతాలకే డిప్యుటేషన్‌ల ద్వారా చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సాధారణంగా డిప్యుటేషన్ అనేది శాఖ అవసరాల కోసం, ప్రత్యేక నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరమైనప్పుడు మాత్రమే ఇవ్వాల్సిన పరిపాలనా విధానం. కానీ TGPCBలో మాత్రం కొందరి వ్యక్తిగత అవసరాలు, పలుకుబడులు, పరిచయాల ఆధారంగా డిప్యుటేషన్‌లు జరుగుతున్నాయనే విమర్శలు ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

గతంలో GHMC పరిధిని ఒకే యూనిట్‌గా పరిగణిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పలువురిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. అయితే ఆ తర్వాత కొందరు ప్రభావశీలులు అడ్మినిస్ట్రేషన్  విభాగంలోని సీనియర్  వ్యక్తులతో కుమ్మ క్కు అవడంతో ఆ అడ్మినిస్ట్రేషన్   సీనియర్ అధికారి పై అధికారులను తప్పుదోవ పట్టించి తిరిగి GHMC పరిధికే డిప్యుటేషన్‌లపై ఇచ్చినట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఇప్పుడు మళ్లీ అదే తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ శాఖలో జోరుగా సాగుతోంది. దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలుగా GHMC పరిధిలోనే పనిచేసిన ఒక అధికారి ఇటీవల ఇతర జిల్లాకు బదిలీ అయినప్పటికీ, మళ్లీ అదే ప్రాంతానికి డిప్యుటేషన్ పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఇదే సమయంలో పలుకుబడి లేని ఉద్యోగులు మాత్రం బదిలీ అయిన చోటే విధులు నిర్వహిస్తూ ఆవేదన చెందుతున్నారని సహోద్యోగులు చెబుతున్నారు. ఒకరికి ఒక నిబంధన, మరొకరికి మరో నిబంధన అన్న భావన ఉద్యోగుల్లో పెరుగుతోందని అంటున్నారు.

ఈ వ్యవహారంపై ఒక పర్యావరణ ప్రేమికుడు సంబంధిత అధికారులకు, లోకాయుక్త, విజిలెన్స్, సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్ లకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. డిప్యుటేషన్‌ల వెనుక ఉన్న అసలు కారణాలు, వాటికి అనుసరించిన విధానాలు, ఎంపిక ప్రమాణాలపై పూర్తి విచారణ జరపాలని ఆయన కోరనున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా, గతంలో GHMC పరిధి నుంచి ఇతర జిల్లాలకు బదిలీ అయ్యి, అనంతరం పరిపాలన విభాగంలోని అప్పటి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి సహకారంతో తిరిగి GHMC పరిధికే డిప్యుటేషన్‌లు పొందిన ఉద్యోగుల వ్యవహారంపై కూడా సమగ్ర విచారణ జరపాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. అటువంటి డిప్యుటేషన్‌లు నిబంధనలకు విరుద్ధంగా జరిగి ఉంటే, సంబంధిత ఉద్యోగులను తిరిగి వారి బదిలీ అయిన ప్రాంతాలకు పంపడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

గతంలో జరిగినట్లుగా మళ్లీ అక్రమ డిప్యుటేషన్‌లకు అవకాశం కల్పించకుండా, ఈసారి అయినా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి పారదర్శకంగా వ్యవహరించాలని ఉద్యోగులు కోరుతున్నారు. బదిలీల ఉద్దేశ్యాన్ని నీరుగార్చే విధంగా డిప్యుటేషన్‌లు ఇవ్వకుండా, నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

గూఢచారి ప్రశ్న?

“వీరి వీరి గుమ్మడి పండు... వీరి పేరు ఏమి?” అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? బదిలీలు కేవలం కాగితాలకే పరిమితమా? ‘ఎక్కడి వాళ్లు అక్కడే గప్ చుప్’ అనే డిప్యుటేషన్ రాజకీయానికి TGPCBలో మళ్లీ తెరలేస్తున్నారా?

ఇప్పటికైనా అక్రమాలు జరగకుండా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని, డిప్యుటేషన్‌ల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని ఉద్యోగులు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

– గూఢచారి ప్రత్యేక కథనం

Comments